వరుణుడు కరుణిస్తేనే మాచ్‌ఖండ్‌ పవర్‌ | - | Sakshi
Sakshi News home page

వరుణుడు కరుణిస్తేనే మాచ్‌ఖండ్‌ పవర్‌

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

కళ తప్పుతున్న జోలాపుట్టు జలాశయం

గణనీయంగా తగ్గిపోతున్న నీటిమట్టం

అంతంతమాత్రంగా నిల్వలున్న ఆంధ్రాకు చెందిన జోలాపుట్టు ప్రధాన జలాశయం

పూర్తిగా అడుగంటిన జోలాపుట్టు స్పిల్‌వే జలాశయం

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి ప్రధాన నీటి వనరు అయిన జోలాపుట్టు జలాశయం నీటి కళ తప్పుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా జలాశయంలో నీటి మట్టం వేగంగా పడిపోతోంది. నీరు తగ్గుతుండటంతో జలాశయం గర్భంలోని రాళ్లు బయటపడి కనిపిస్తున్నాయి.

● జోలాపుట్టు జలాశయం నుంచి డుడుమ జలపాతానికి నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగుతుండటం, మరోవైపు ఎండల వల్ల నీరు ఆవిరైపోతుండటంతో నిల్వలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఒడిశాకు చెందిన స్పిల్‌వే డ్యామ్‌ ప్రాంతం పూర్తిగా అడుగంటిపోయింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన జలాశయ భాగంలో మాత్రమే స్వల్పంగా నీటి నిల్వలు ఉన్నాయి.

● ఈ (మే) నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. జలాశయం తిరిగి జలకళ సంతరించుకోవాలంటే వర్షాలే దిక్కని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపైనే జోలాపుట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement