విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదాం | - | Sakshi
Sakshi News home page

విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదాం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

సబ్బవరం: విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదామని 13వ ఆంధ్రా బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ నీరజ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో గ్రీన్‌ క్లైమేట్‌ బృందం ఆధ్వర్యంలో ఆదివారం విత్తన బంతులు తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ విత్తనాలు వృథా కాకుండా వాటిని సేకరించి విత్తన బంతులు తయారు చేయడం మన బాధ్యత అన్నారు. ప్రతి ఎన్‌సీసీ క్యాడెట్‌ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం కూడా ఓ సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా క్యాడెట్లు సుశిక్షితులు కావాలని అభిలషించారు. క్రమశిక్షణ, అభ్యాసం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సాగుతున్న శిబిరంలో క్యాడెట్లు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. శిబిరంలో భాగంగా ఉదయం నుంచి క్యాడెట్లకు కఠిన శారీరక శిక్షణ అందించారు. పరుగు, సాగతీత వ్యాయామాలతో వారి శారీరక సామర్థ్యాన్ని పెంపొందించారు. అనంతరం జరిగిన డ్రిల్‌ పరేడ్‌లో క్యాడెట్లు కచ్చితత్వం, సమన్వయంతో ఆకట్టుకున్నారు. విద్యాపరమైన సెషన్లలో భారత రక్షణ వ్యవస్థపై అవగాహన కల్పించారు. సైన్యం కార్యాచరణ, ఆయుధాలు–పరికరాలు, ర్యాంక్‌ నిర్మాణం వంటి అంశాలను వివరించి, భవిష్యత్‌లో సైనిక రంగంపై ఆసక్తిని పెంపొందించారు. ఇదే సందర్భంలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ పద్ధతులు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అధికారి స్థాయికి చేరేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు అనంతభాస్కర్‌, జగదేశ్వరరావు, సన్యాసిరావు, హరికిరణ్‌, గ్రీన్‌ క్ల్లైమేట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

13వ ఆంధ్ర బెటాలియన్‌ లెఫ్టినెంట్‌

కల్నల్‌ నీరజ్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement