స్మార్ట్‌ఫోన్‌ వద్దు.. పుస్తకమే ముద్దు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ వద్దు.. పుస్తకమే ముద్దు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

చిన్నారులకు 5 వేల పుస్తకాల పంపిణీ

డాబాగార్డెన్స్‌: పుస్తక పఠనం కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు, మానసిక వికాసాన్ని కూడా అందిస్తుంది. ఈ వేసవి సెలవుల్లో పిల్లలను స్మార్ట్‌ఫోన్ల నుంచి పుస్తకాల వైపు మళ్లించేందుకు వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంచి పుస్తకం, కిట్స్‌, లెర్న్‌ అండ్‌ హెల్ప్‌ సంస్థల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పుస్తక పంపిణీ చేపట్టింది. జిల్లాలోని 100 క్లబ్‌లు, క్రియేటివ్‌ లెర్నింగ్‌ సెంటర్లలోని పిల్లల కోసం సుమారు 5 వేల పుస్తకాలను అందజేస్తున్నట్లు క్లబ్‌ జిల్లా కన్వీనర్‌ కె.సుశీల తెలిపారు. ఒక్కో కేంద్రానికి 50 పుస్తకాల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దాతల సహకారంతో భవిష్యత్తులో వీటిని మినీ లైబ్రరీలుగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ పుస్తకాలను పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలతో, పెద్ద అక్షరాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించారు. వేసవి సెలవుల్లో పిల్లల చేత కథలు రాయించి, వాటిని వైజాగ్‌ కథలు పేరిట పుస్తక రూపంలో తీసుకురావడానికి కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలను విరాళంగా అందించిన శివరామకృష్ణ, సి.ఎ.ప్రసాద్‌లకు క్లబ్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ కె.రమాప్రభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు పిల్లల ఊహాశక్తిని పెంచి, వారిలో సామాజిక స్పృహను కలిగిస్తాయని ఆమె ఆకాంక్షించారు. కాగా.. ఈ పుస్తకాల్లో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగపడే కథాకదంబం, పుస్తకమాల, టింకు–పెంకు, పుస్తకాలతో స్నేహం, ఫోను ఈ తరం కుర్రాడు, ఈసోపు కథలు, సుతయేవ్‌ కథలు, కథలంటే మాకిష్టం, ఉక్రేనియన్‌ జానపద గాథలు, చింటూ–బుజ్జి, వింత దృశ్యం, లెక్కల సారు–రెక్కల గుర్రం, మా పిల్లికి లెక్కలొచ్చు, బావిలో చంద్రుడు, కదిలే టోపీ వంటి ఆసక్తికరమైన శీర్షికలు ఉన్నాయి. కార్యక్రమంలో ఎసెన్స్‌ గ్రూప్‌ ప్రతినిధి పోలినా దేవి, చిల్డ్రన్స్‌ క్లబ్‌ సభ్యులు పి.సతీష్‌, భారతి, మణి, మోదాంబిక, ప్రీతితో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement