పరీక్ష వేళ పోలీసుల మానవత్వం | - | Sakshi
Sakshi News home page

పరీక్ష వేళ పోలీసుల మానవత్వం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

విద్యార్థినికి అండగా నిలిచిన సీఐ

మల్కాపురం: నీట్‌ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థిని ఆఖరి నిమిషంలో ఎదుర్కొన్న సమస్యను మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు యాదవ్‌ పరిష్కరించి, అభినందనలు అందుకున్నారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన బెహరా హిమబిందు అనే విద్యార్థిని ఆదివారం మల్కాపురంలోని కేవీ–2 పాఠశాలలో నీట్‌ రాసేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. అయితే, పొరపాటున ఆమె తన వెంట తీసుకురావాల్సిన పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలను మర్చిపోయింది. పరీక్ష నిబంధనల ప్రకారం ఫొటోలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. సమయం తక్కువగా ఉండటం, పరీక్ష రాయలేనేమో అన్న భయంతో ఆ యువతి అక్కడ కన్నీరు పెట్టుకుంది. అక్కడ విధుల్లో ఉన్న సీఐ ఆ విద్యార్థిని ఆవేదనను గమనించారు. విషయం తెలుసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన సిబ్బందిని పిలిచి పోలీసు ద్విచక్ర వాహనంపై ఆ విద్యార్థినిని శ్రీహరిపురంలోని ఫొటో స్టూడియోకు పంపించారు. అక్కడ ఫొటోలు తీయించి, సకాలంలో ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చొరవ చూపారు. సీఐ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల హిమబిందు పరీక్ష రాయగలిగింది. ఈ సందర్భంగా సీఐకి ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement