పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి పాదయాత్ర

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

సింహాచలం: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూసమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆదివారం నుంచి పాదయాత్రను చేపట్టింది. తొలిరోజు నాయుడుతోటలో ప్రారంభమైన ఈ యాత్రను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె. లోకనాథం, జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల నుంచి భూసమస్య కారణంగా రైతులు, ఇళ్ల యజమానులు, స్థలాల యజమానులు రిజిస్ట్రేషన్లు కాక, అభివృద్ధి పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా సమస్య మాత్రం అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు.ప్రజలకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని, భూహక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని వారు వెల్లడించారు. నాయుడుతోట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సాయిమాధవ్‌నగర్‌, భరత్‌నగర్‌ మీదుగా సాగింది. కార్యక్రమంలో పంచగ్రామాల కాలనీల సంఘాల ప్రతినిధులు, సీపీఎం నాయకులు బి.జగన్‌, పి.వెంకటరెడ్డి, బి.వెంకట్రావు, ముద్దాడ ప్రసాద్‌, యు.రాజు, ప్రభావతి, తిరుపతిరావు, జ్యోతీశ్వరరావు, ప్రభుదేవా, సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement