ప్రజా వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

మహారాణిపేట: ప్రజల నుంచి అందిన వినతులు, ప్రజా ప్రతినిధులు సూచించిన అంశాల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. గంగవరం పోర్ట్‌ నుంచి షీలానగర్‌ వరకు ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, యారాడ–గంగవరం ప్రాంతాల్లో బ్రేక్‌ వాటర్‌ జెట్టి ఏర్పాటును ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులతో పాటు చిలకపేట సరస్సు పార్క్‌ అభివృద్ధి, కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని డ్రైనేజీ సమస్యల పరిష్కారం, ద్వారకా బస్టాండ్‌ అభివృద్ధి, హార్బర్‌ ఆధునికీకరణ పనులపై కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేజీహెచ్‌లోని ఓపీ, ఎంసీహెచ్‌ బ్లాకుల ఆధునికీకరణ, కొత్త యూపీహెచ్‌సీల ఏర్పాటు, మధురవాడ, భీమిలి పరిధిలోని పీహెచ్‌సీల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే తగరపువలస వద్ద ఆర్టీసీ డిపో ఏర్పాటు, తోటగరువు జూనియర్‌ కళాశాల ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించాలని సూచించారు. తీర ప్రాంత రక్షణకు బీచ్‌ రోడ్డులో అవసరమైన చోట్ల రక్షణ గోడల నిర్మాణం, ఏపీఐఐసీ భూముల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ఆయా శాఖలు సమన్వయంతో పని చేయా లని స్పష్టం చేశారు. ప్రతి అంశంపై నిర్దిష్ట కాలపరిమితిలోగా పురోగతి నివేదికలను సమర్పించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతమైన ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు శేషశైలజ, సంగీత్‌ మాధుర్‌, అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement