మహారాణిపేట: కేజీహెచ్‌లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అక్కడి అధికారులను ఆదేశించారు. శనివారం కేజీహెచ్‌లోని ఓపీ వార్డు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులు, సీఎస్సార్ బ్లాక్‌ను సందర్శించారు. సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి వైద్యులతో సమావేశమయ్యారు. వివిధ విభాగాల హెచ్‌వోడీలతో మాట్లాడి ఆయా విభాగాల ద్వారా అందుతున్న సేవలు, అక్కడున్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డుల సామర్ధ్యం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, ఆధునిక పరికరాల వినియోగం, ఇతర అవసరాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో పలు అంశాలను ఆయా విభాగాల హెచ్‌వోడీలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై త్వరలోనే చర్చిద్దామని, రాష్ట్ర స్థాయిలో అంశాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణితో పాటు, ఇతర వైద్యాధికారులు ఉన్నారు.
కేజీహెచ్‌ను సందర్శించి, వార్డులను పరిశీలించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్


