మహారాణిపేట: జనగణన విధులను తమకు రద్దు చేయాలని రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) శనివారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌ను కోరారు. ఏపీ మెప్మా ఎండీ ఆదేశాల ప్రకారం ఆర్పీలకు జనగణన డ్యూటీలు ఇవ్వకూడదని ఉన్నప్పటికీ, జీవీఎంసీ అధికారులు వాటిని అమలు చేయకుండా డ్యూటీలు విధించారని కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వయం సహాయక ఫెడరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలు అనారోగ్య కారణాల వల్ల మినహాయింపు కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్లు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అమర్యాదగా మాట్లాడుతున్నారని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి తెలిపారు. అలాగే, నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, లాగిన్ నిలిచిపోయిన వారికి తక్షణం పునరుద్ధరించాలని, అక్షరాంధ్ర నిధులను విడుదల చేయాలని, ఎటువంటి కోతలు లేకుండా పూర్తి వేతనం చెల్లించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.ఝాన్సీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యలను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మణి తెలిపారు.


