మాకొద్దీ.. ప్రైవేటు రోడ్లు | - | Sakshi
Sakshi News home page

మాకొద్దీ.. ప్రైవేటు రోడ్లు

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

● పీపీపీ ప్లాన్‌ ఫ్లాప్‌
విశాఖలో రోడ్ల టెండర్లకు బిడ్‌ దాఖలు కాని పరిస్థితి లాభాలు భారీగా ఉన్నా.. ప్రైవేటు సంస్థల నిరాసక్తత రాజకీయ అనిశ్చితి, 10 ఏళ్ల ఒప్పందమే కారణమా?
ప్రభుత్వానికి భారీ షాక్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

రాష్ట్రాన్ని ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేయాలన్న ప్రభుత్వ వ్యూహానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మెడికల్‌ కాలేజీల నుంచి మున్సిపల్‌ రోడ్ల వరకు ప్రతిదీ ‘పీపీపీ’ (ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం) ముసుగులో కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టాలని సర్కారు వేసిన ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో ప్రధాన రహదారులను ప్రైవేటు పరం చేసేందుకు పిలిచిన టెండర్లలో ఒక్కటంటే ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారింది.

అప్పనంగా అప్పగిస్తున్నా..

ఇటీవల విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ కోసం పీపీపీ విధానంలో రూ.477 కోట్ల విలువైన ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించారు. విశాఖలో రూ.306 కోట్లతో 88.54 కిలోమీటర్లు, విజయవాడలో రూ.171 కోట్లతో 23.54 కిలోమీటర్ల రోడ్లను పదేళ్ల పాటు నిర్వహించే బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. ఇది మొదటిసారి కాదు. మెడికల్‌ కాలేజీల పీపీపీ టెండర్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రైవేట్‌ సంస్థలు పూర్తిగా వెనుకంజ వేయడం ప్రభుత్వ విధానాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

వ్యయం ప్రభుత్వానిది.. లాభాలు ప్రైవేటుకి..

ప్రైవేటు సంస్థలకు అపరిమితమైన ప్రయోజనాలు చేకూర్చేలా ఈ టెండర్‌ నిబంధనలను రూపొందించారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లే ముందుగా భరిస్తుండగా, మిగిలిన 60 శాతం మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి ఐదు విడతల్లో కాంట్రాక్టు సంస్థలకే తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 60 శాతం నిధులను సదరు సంస్థలు సొంతంగా లేదా బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోవచ్చు. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు 20 శాతం సమాన వాయిదాల్లో బ్యాంకు వడ్డీకి అదనంగా 1.25 శాతం కలిపి మరీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, పెట్టుబడి భారం దాదాపుగా ప్రభుత్వంపైనే పడుతుండగా, నిర్వహణ పేరుతో ప్రైవేటు సంస్థలకు కాసుల వర్షం కురిపించేలా ఈ వ్యూహం ఉంది.

ప్రైవేటు సంస్థలకు సర్వాధికారాలు

ఈ పీపీపీ విధానం ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై ప్రైవేటు సంస్థలకు సర్వాధికారాలు కట్టబెట్టారు. పదేళ్ల కాలపరిమితిలో రోడ్ల మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపుల ద్వారా వచ్చే వాణిజ్య ప్రకటనల ఆదాయం అంతా నేరుగా కాంట్రాక్టు సంస్థ జేబుల్లోకే వెళ్తుంది. అంతేకాకుండా, వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఇతర సంస్థలు తీసుకునే ‘రోడ్‌ కటింగ్‌’ అనుమతుల రుసుములను కూడా ప్రైవేటు ఖాతాలోకే వెళ్లేలా ప్రాజెక్టును అత్యంత తెలివిగా రూపొందించారు. దీనివల్ల భవిష్యత్తులో కీలక రహదారులన్నీ ప్రైవేటు శక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోతాయని, చివరికి సాధారణ ప్రజలు ఆ రోడ్లపై నడవాలన్నా ‘వాకింగ్‌ ఫీజు’ చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్ల ఒప్పందమే ప్రధాన అడ్డంకి?

ఇంజనీరింగ్‌ వర్గాల అంచనాల ప్రకారంం ప్రాజెక్టు వ్యవధి పదేళ్లు ఉండటమే పెద్ద కారణంగా కనిపిస్తోంది. 2–3 సంవత్సరాల ఒప్పందం అయితే సంస్థలు ముందుకు వచ్చేవని అభిప్రాయం. కానీ పదేళ్ల పాటు పాలసీలు, రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో తెలియని అనిశ్చితి సంస్థలను వెనక్కి నెడుతోంది.

రాజకీయ ప్రభావమా?

పీపీపీ విధానంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ‘‘పీపీపీ విధానంలో వచ్చిన ప్రాజెక్టులను భవిష్యత్తులో పునఃపరిశీలిస్తాం’’ అన్న సంకేతాలు ప్రైవేట్‌ సంస్థల్లో సందేహాలు రేకెత్తించాయి.

తమ వారికి కట్టబెట్టేందుకు సరికొత్త ప్లాన్‌?

మొదటి విడత టెండర్లు అట్టర్‌ ప్లాప్‌ కావడంతో, ఇప్పుడు నిబంధనలను మరింతగా సడలించి, ప్రైవేటు సంస్థలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి ‘తమ వారికి’ పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం తెరవెనుక పావులు కదుపుతోంది. పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టే ఈ కుట్రను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement