సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ విషయంలో, కార్మికుల ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కానీ చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. వారి పొట్టకొట్టే విధానాలను అమలు చేస్తూ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు పోయి చీకటి మిగిలిందని, చంద్రబాబు సర్కార్ కార్మికుల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం విధిస్తున్న కఠిన నిబంధనలు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం వల్ల కార్మికులపై భారం పెరిగిందన్నారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడే చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులను కూడా వేధిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడడంలో విఫలమైన ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతలు కోలా గురువులు, రవిరెడ్డి, సతీష్ వర్మ, కొండా రాజీవ్ గాంధీ, పేడాడ రమణి కుమారి, పి.వి. నారాయణ, తాడి జగన్నాథ్ రెడ్డి, పల్లా దుర్గారావు, ఉమ్మడి స్వాతి, పేర్ల విజయ చంద్ర, జి.వి.రవిరాజు, వేంపాడు శ్రీనివాస్ రెడ్డి, భర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, ముట్టి సునీల్ కుమార్, దేవి వర్మ, మనోజ్ పట్నాయక్, బోని శివ రామకృష్ణ, రామారెడ్డి, నీలి రవి, సాడి పద్మారెడ్డి, మన్మధ రావు, బిపిన్ కుమార్ జైన్, అలంపల్లి రాజబాబు, రామన్న పాత్రుడు, ఈశ్వరరావు, వై. శ్రీనివాస్ రావు, అప్పన, వెంకట సత్య, పార్వతి, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం


