తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్ వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నుంచి గుంతకల్–విశాఖపట్నం (18522) తిరుమల ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని గుంతకల్ నుంచే ప్రారంభించనుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్‌లో బయల్దేరే ఈ రైలు, మధ్యాహ్నం 1.55 గంటలకు గుత్తి చేరుకుంటుంది. అక్కడ రెండు నిమిషాల విరామం తర్వాత 1.57 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2.50 గంటలకు తాడిపత్రికి, 3.13 గంటలకు కొండాపురానికి, 3.58 గంటలకు యర్రగుంట్లకు చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 5.38 గంటలకు కడప చేరుకుని, అక్కడ నుంచి 5.40 గంటలకు బయల్దేరి.. పాత వేళల ప్రకారమే విశాఖపట్నం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–గుంతకల్ (18521) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13వ తేదీ నుంచి రాకపోకలు ప్రారంభిస్తుంది. విశాఖపట్నంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరే ఈ రైలు, మరుసటి రోజు ఉదయం 7.03 గంటలకు కడప చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.05 గంటలకు బయల్దేరి, ఉదయం 7.38 గంటలకు యర్రగుంట్ల, 8.10 గంటలకు కొండాపురం, 8.33 గంటలకు తాడిపత్రి, 9.13 గంటలకు గుత్తి స్టేషన్‌లకు చేరుకుంటుంది. చివరగా ఉదయం 11.30 గంటలకు ఈ రైలు గుంతకల్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రైలు పొడిగింపు నేపథ్యంలో ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.


