
వైద్యంలో రోగి పూర్వ చరిత్ర పరిశీలన కీలకం
● నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● మధురవాడలో ఐసాకాన్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభం
మధురవాడ: వైద్య విధానంలో రోగి పూర్వ చరిత్ర పరిశీలన వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఈ అంశం అనస్తీషియా వైద్యులతో పాటు అన్ని విభాగాల వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మధురవాడలోని విశాఖ వి.కన్వెన్షన్ సెంటర్‌లో ఐసాకాన్ పేరుతో నిర్వహిస్తున్న 40వ ఇండియన్ అనస్తీషియా సౌత్ జోన్ కాన్ఫరెన్స్, 34వ రాష్ట్ర మహా సభలను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్యంలో అనస్తీషియాకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వైద్య విధానాల్లో వస్తున్న మార్పులు, నూతన పోకడలు, సాంకేతికతపై వైద్యులతో పాటు పీజీ విద్యార్థులు దృష్టి సారించాలని సీపీ సూచించారు. ఐఎస్‌ఏ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బాలవెంకట్, డాక్టర్ బాజువాలు మాట్లాడుతూ.. చికిత్సల సందర్భంగా రోగికి నొప్పి లేకుండా మత్తు ఇవ్వడంతో పాటు తిరిగి యథాస్థితికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు సదస్సు ప్రాధాన్యతను, వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి క్షుణ్ణంగా వివరించారు. సదస్సులో భాగంగా పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రచురించిన పత్రాలను నిపుణులకు సమర్పించారు. యువ వైద్యులకు క్విజ్ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సీపీ బాగ్చికి శాలువాలు కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన సుమారు 1,300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రంగంలో ఉన్న పీజీ విద్యార్థులు, ప్రాక్టీషనర్స్‌కు అవసరమయ్యే వెంటిలేటర్లు, మత్తు యంత్రాలు, ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాలు, మొదలైన 36 రకాల స్టాళ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఐఎస్‌ఏ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఠాగూర్, డాక్టర్ చక్రరావు, డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్ కుచెల్‌బాబు, డాక్టర్ భీమేశ్వరరావు, ఏపీ మాజీ అధ్యక్షుల, నగర బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ కె. పరంజి తదితరులు పాల్గొన్నారు.