
రైల్వే సిబ్బంది చొరవతో మహిళ సుఖ ప్రసవం
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్‌లోని కమర్షియల్ కంట్రోల్ సిబ్బంది మానవత్వంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఘటన ఇది. ఆదివారం రాత్రి చర్లపల్లి నుంచి కిషన్‌గంజ్ వెళ్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ విశాఖలో బయలుదేరిన తర్వాత, సుమారు 11:30 గంటల సమయంలో ఎస్–4 కోచ్‌లో ప్రయాణిస్తున్న కె. జైనాబ్ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె రైల్లోనే ప్రసవించారు. వెంటనే స్పందించిన కమర్షియల్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారు. కొత్తవలస స్టేషన్‌లో రైలును నిలిపివేసి, తల్లీబిడ్డను అత్యవసరంగా కిందికి దించారు. అనంతరం, వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్లిష్ట సమయంలో రైల్వే అధికారులు చూపిన తక్షణ స్పందనను ప్రయాణికులు, జైనాబ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించిన రైల్వే సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.