
పచ్చదనం పెంపుపై దృష్టి
నగర ప్రజలకు మేయర్ పిలుపు
ఎంవీపీకాలనీ: నగర ప్రజలు పచ్చదనం పెంపుపై దృష్టిసారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శివాజీ పార్కులోని యోగా సాధన సెంటర్ వేదికగా శనివారం ‘బీట్ ద హీట్’నినాదంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణకు అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, టెర్రస్ గార్డెన్‌లు అభివృద్ధి చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఉపశమనం కోసం నగరంలో గ్రీన్ షేడ్స్, 106 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు భవనాలపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి ఎస్.ఢిల్లీరావు, కార్పొరేటర్లతో కలిసి మేయర్, కలెక్టర్ బీట్ ద హీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్కులో మొక్కలు నాటారు. తొలుత కేంద్ర సబ్సిడీ నిధులు రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను మేయర్, కలెక్టర్ ప్రారంభించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ నమూనా, వరి కంకులు, వాటర్ బౌల్స్, చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించి.. నిర్వాహకులను అభినందించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్ రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, జోనల్ కమిషనర్లు శివప్రసాద్, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.