
సీపీఆర్‌తో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ డేటా ఆధారిత నిర్ణయాలను బలోపేతం చేసుకునేందుకు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సీజీఎం పి.శ్రీనివాస్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు చొక్కాకుల శ్రీనివాస్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మున్సిపల్ శాఖ వంటి అనేక శాఖలతో కలిసి పనిచేసిన అనుభవంతో ఇకపై ఏపీఈపీడీసీఎల్‌తో పనిచేయనుంది. విద్యుత్ పంపిణీ సామర్థ్యం, ఆదాయ వృద్ధే లక్ష్యంగా సీపీఆర్ సంస్థ ఏపీఈపీడీసీఎల్‌కు డేటా ఆధారిత విశ్లేషణలు చేయడంతో పాటు సంస్థ సిబ్బందికి అధ్యయనాలు, సూచనలు చేయనుంది. ఈపీడీసీఎల్‌లో ఏర్పాటు చేసిన డేటా అనలిటిక్ యూనిట్ (డీఏయూ)ను అభివృద్ధి పరచడం ద్వారా సంస్థ అంతర్గత వ్యవస్థ సామర్థ్యాలను పెంచడం, ఏపీఈపీడీసీఎల్ బిల్లింగ్ వ్యవస్థలోని రెవెన్యూ నష్టాలను తగ్గించడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి డేటా విశ్లేషణలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సీపీఆర్ సహకరిస్తుంది.