వసూళ్లపై విజిలెన్స్‌ ఆరా! | Sakshi
Sakshi News home page

వసూళ్లపై విజిలెన్స్‌ ఆరా!

Published Sun, May 19 2024 6:20 AM

-

సాక్షి, విశాఖపట్నం : విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో వసూళ్ల పర్వానికి పాల్పడుతున్న వైనంపై విజిలెన్స్‌ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కాలంగా ఎక్కడెక్కడ ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారో.. దానికి సంబంధించిన వివరాలను విజిలెన్స్‌ సేకరిస్తోంది. ఉమ్మడి విశాఖలో తరచుగా జరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలపై ‘సమన్వయ లోపంతో షాక్‌’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్‌ దృష్టిసారించింది. మరోవైపు కథనంపై ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ అధికారులు స్పందిస్తూ విద్యుత్‌ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సబ్బవరం, ఇతర మండలాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై దృష్టిసారిస్తున్నామని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఎస్‌ఈ మహేంద్రనాథ్‌ అన్నారు. రెండు నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన హెల్పర్స్‌.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లడం వల్ల దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయంలో మిగిలిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. అదేవిధంగా కశింకోట డివిజన్‌ పరిధిలో ప్రతి చోటా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని డివిజన్‌ ఈఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్‌ అంతరాయాలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తున్నాం..

వసూళ్లపై దృష్టిసారిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

ఈపీడీసీఎల్‌ విశాఖ సర్కిల్‌ అధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement