● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
● రోడ్లపై నిలిచిన వరదనీరు
తాండూరు టౌన్: పట్టణ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. గాలి తీవ్రతకు మాతాశిశు ఆస్పత్రి గేటు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖాఽధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధుల్లో వరదనీరు నిలవడంతో జనాలు ఇబ్బంది పడ్డారు.
దంచికొట్టిన వాన
యాలాల: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలి తీవ్రతకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో కరెంటు సరఫరా ఆగిపోయింది. యాలాలకు చెందిన మల్లేశం కొత్త ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పోయాయి. యాలాల – లక్ష్మీనారాయణపూర్ మార్గంలో ఓ భారీ చెట్లు నేలకొరిగింది.
తడిసిన జొన్న బస్తాలు
ధారూరు: మండలంలోని మునూక్నరుసోమారం కొనుగోలు కేంద్రంలో వర్షానికి జొన్నల బస్తాలు తడిసిపోయాయి. తూకం వేసిన జొన్నలను తరలించకపోవడంతోనే నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.


