ఫ్యూచర్‌లో విధులు షురూ | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌లో విధులు షురూ

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

లేఅవుట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇక్కడే..

ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో పనులు ప్రారంభించిన కమిషనర్‌ శశాంక

కందుకూరు: ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయంలో అధికారులు విధులు ప్రారంభించారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించగా గురువారం కమిషనర్‌ శశాంకతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చుని విధులు నిర్వహించారు. కాగా 2025 సెప్టెంబర్‌ 28న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతన భవనానికి శంకుస్థాపన జరగ్గా, డిసెంబర్‌ మొదటి వారంలో పనులు ప్రారంభించారు. ఆరు నెలల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కార్యాలయ భవనంలో ఐజీబీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలు, బయో ఎస్టీపీ ద్వారా మురుగు నీటి శుద్ధి వ్యవస్థ, సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ వంటి పర్యావరణ అనుకూల సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించేలా ఎఫ్‌సీడీఏ కార్యాలయం మోడల్‌గా నిలవనుంది. 56 గ్రామాల పరిధితో ప్రారంభమైన ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రజల కోరిక మేరకు అదనంగా కందుకూరు, మహేశ్వరం, యాచారం మండలాలకు చెందిన మరికొన్ని గ్రామాలను చేర్చారు. దీంతో ఎఫ్‌సీడీఏ పరిధి విస్తృతం కానుంది.

ఎఫ్‌సీడీఏ పరిధిలోని గ్రామాల్లో కొత్తగా లేఅవుట్లు వేయాలన్నా, కమర్షియల్‌ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నా ఇక్కడి నుంచే అనుమతులు పొందాలి. మరోపక్క గ్రామాల్లో 300 మీటర్లకు పైబడిన స్థలాల్లో నివాసాలతో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఇకపై ఎఫ్‌సీడీఏ పర్మిషన్‌ తప్పనిసరి కానుంది. తన ఛాంబర్‌లో విధులు ప్రారంభించిన కమిషనర్‌ శశాంకకు ఎఫ్‌సీడీఏ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement