
పైన పచారీ.. లోన లిక్కర్
దుద్యాల్: కొడంగల్ నియోజకవర్గంలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. మద్యం షాపుల్లో కొరత ఉన్నా.. కిరాణా దుకాణాల్లో విరివిగా లభ్యం అవుతోంది. ఇతర సామగ్రి కంటే.. లిక్కర్‌నే ఎక్కువగా విక్రయిస్తున్నారని, అదికూడా అధిక ధరలకు అమ్ముతూ.. మందుబాబుల జేబుకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోందని, అయినా.. ఆబ్కారీ శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదనంగా బాదుడు
బెల్ట్ షాపుల్లో మద్యం క్వాటర్ బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే.. అదనంగా రూ.20 తీసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో, అత్యవసరంగా మద్యాన్ని కొనుగోలు చేసేవారు అడిగినంత ఇస్తున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. చిప్ లిక్కర్ నుంచి బ్రాండెడ్ మద్యం వరకు ప్రతి బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు వసులు చేస్తున్నారు.
దుద్యాల్‌లో 200లకు పైగా..
నియోజకవర్గ పరిధి పల్లెల్లో బెల్ట్ షాపులు ఇష్టాను సారంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రాల్లోనూ అధికంగానే ఉన్నాయి. ఒక్క దుద్యాల్ మండలంలో సుమారు 200లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నడుస్తున్నాయి. ఇలా నిరంతరం మద్యం లభ్యం కావడంతో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిత్యం మత్తులో జోగుతున్నారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది.
కొరత సృష్టిస్తూ..
బెల్టు షాపుల నిర్వాహకులు.. మద్యం వ్యాపారులతో కుమ్మక్కు అయ్యారు. వారికి కావాల్సిన సరుకు ఇస్తూ.. పల్లెలకు తరలిస్తున్నారు. అనంతరం వైన్ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. మద్యం స్టాక్ లేదని, ఫుల్ బాటిళ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొంటూ.. ఆఫ్, ఫుల్లు సీసాలను అంటగడుతున్నారు. దీంతో కొద్దిగా తాగే అలవాటు ఉన్న వారు సైతం.. అధికంగా మద్యం తాగుతూ.. ఒళ్లు హూనం చేసుకొంటున్నారు.
వైన్‌షాపుల్లో కొరత..
కిరాణా దుకాణాల్లో అడిగినంత
మద్యం వ్యాపారులతో లింక్
పల్లెల్లో జోరుగా బెల్టు దందా
పట్టించుకోని ఆబ్కారీ అధికారులు
ఫిర్యాదు చేస్తే..
వైన్ షాపుల్లో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంది. కొనుగోలు దారులను.. వ్యాపారులు ఇబ్బందులకు గురిచేయొద్దు. వారు అడిగింది ఇచ్చేయండి. కొరత సృష్టిస్తే.. చర్యలు తప్పవు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందినా తగిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్, ఎకై ్సజ్ సీఐ, కొడంగల్