
పార్కు స్థలం కబ్జాపై హైడ్రా కొరడా
హయత్‌నగర్: పార్కు స్థలం ఆక్రమణపై హైడ్రా కొరడా ఝులిపించింది. పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మి గణపతి కాలనీలోని సుమారు 700 గజాల స్థలంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసి స్థలాన్ని విడిపించారు. తట్టిఅన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76/ఎలో 9.24 ఎకరాల భూమిలో గతంలో లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్‌లో సుమారు 2,800 గజాల ఖాళీ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలేశారు. ఇందులో 700 గజాల స్థలం పురాతన బావి దగ్గర ఉంది. కొంత కాలంగా ఈ స్థలంపై కన్నేసిన స్థానిక నాయకుడు సుమారు 270 గజాలు కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి ప్రహరీ నిర్మించాడు. స్థలం ఆక్రమణపై కాలనీవాసులు కొంత కాంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వివరాలు సేకరించి పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం జేసీబీలతో అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు.