
ఔత్సాహిక ఆలోచన పెరగాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి
మొయినాబాద్: భారత దేశ యువతలో ఔత్సాహిక ఆలోచన ధోరణిని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న అరిస్టాటిల్ పీజీ కళాశాలలో ‘సుస్థిర ప్రపంచం కోసం ఔత్సాహిక, ఆవిష్కరణలు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత సుస్థిర అభివృద్ధిపై ఆసక్తి పెంచుకుని.. ఆ దిశగా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచడం కోసం మేనేజ్‌మెంట్ విద్యలో ఆ అంశాన్ని చేర్చాలని సూచించారు. యూఎస్‌ఏ స్కైలైన్ యునివర్సిటీ ప్రతినిధి శ్రీమహేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పరిశ్రమల ఏర్పాటు వైపు యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాసీ్త్రయ రచనల సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ రాములు, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నర్సయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.