
ఈతకు వెళ్లి బాలుడి మృతి
మిట్టకోడూర్ గ్రామంలో విషాదం
పరిగి: ఈత సరదా ఓ కుంటుబాన్ని దుఃఖసాగరంలో ముంచింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మిట్టకోడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐనాపురం శ్రీనివాస్, రేనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు వినయ్(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. అందులో గుంతలు ఉండడం, వినయ్‌కి ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి బయటకు వెళ్లి ఇంటికి పరుగులు తీశారు. దారిన ఓ వ్యక్తి వెళ్తుంటే వినయ్ చెరువులో మునిగిపోయాడని చెప్పారు. దీంతో గ్రామస్తులు చెరువు దగ్గరకు వెళ్లి వెతకగా అప్పటికే మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు రూరల్: బావిలో దూకి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంతబాసుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు రమేష్(36) కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం పెద్ద భార్య, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత దేవిబాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కొంతకాలంగా ఇద్దరు బాగానే ఉన్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేవిబాయి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఎటో వెళ్లిపోయాడు. బుధవారం మిట్టబాసుపల్లి గ్రామ శివారులో బావిలో మృతదేహం లభ్యమైన విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు స్థానికులు చెప్పారు. వారు వచ్చి రమేష్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి నర్సింగ్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.