
మోటారుసైకిల్ దగ్ధం
కలువాయి(సైదాపురం) : కలువాయి బస్టాండ్ సెంటర్‌లో సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకుడు కరీముల్లా అనే వ్యక్తికి చెందిన మోటారుసైకిల్ ఆదివారం అగ్నికి ఆహుతైంది. బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగంతో స్థానికులు గమనించి ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైంది.
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
కోట : మండలంలోని కొండుగుంట గ్రామానికి చెందిన నాగరాజు(48) ఆటోడ్రైవర్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు.కుటుంబ కలహాల నేపథ్యంలోలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్ : అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవకోన వద్ద శుక్రవారం జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్‌ఐ లోకేష్ తెలిపిన వివరాల మేరకు.. జీవకోన క్రాంతి నగర్‌కు చెందిన మణి(30) మద్యం తాగి సమీపంలోని ఆలయం వద్ద పడుకున్నాడు. ఇ శివ ప్రసాద్ రెడ్డి, దిలీప్ కుమార్, విజయ్ కుమార్ అనే వ్యక్తులు మణిపై దాడి చేశారు. స్థానికులు గమనించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మణి మరణించడంతో నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు తెలిపారు.
ముక్కంటి ఆలయంలో
గందరగోళం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో వారి సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ఇలాంటిదే ఆదివారం చోటు చేసుకుంది. ఓ మహిళా భక్తురాలు మొబైల్ లగేజ్ కౌంటర్‌లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఏఈఓ, డెప్యూటీ ఈవో అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆ ఫిర్యాదు ను ఎవరికి ఇవ్వాలో తెలియక ఆలయ పరిపాలనా భవనం వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి అక్కడికి రావడం ఆయనతో మాట్లాడి ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దానిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. అదేవిధంగా మరో భక్తురాలు తన డబ్బులు కొట్టేశారని పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి ఆ ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమెకు నచ్చజెప్పి పంపించేశారు. దీనిపై డెప్యూటీ ఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.