
డాక్టర్ మాధవికి కౌన్సిల్‌లో చోటు
తిరుపతి తుడా : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 8 మంది వైద్యులతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను నియమించారు. ఇందులో ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ కె.మాధవికి కౌన్సిల్‌లో చోటు కల్పించారు.
రేపటి నుంచి డిగ్రీ, పీజీ
తరగతులు ప్రారంభం
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు వేసవి సెలవుల అనంతరం తరగతులు ప్రారంభం కానునుండటంతో ఆయా కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కళాశాలలతో పాటు అదే రోజు వసతి గృహాలు సైతం తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పద్మావతి మహిళా వర్సిటీలో సైతం తరగతులు ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్‌జీఎస్, ఎస్వీ ఆర్ట్స్, ఎస్వీ ఓరియంటల్ కళాశాలలు సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
తిరుమలలో
మందుల దుకాణాలు సీజ్
తిరుమల : తిరుమలలో నిబంధనలను ఉల్లంఘించి విక్రయాలు జరుపుతున్న మందుల(మెడికల్) దుకాణాలపై టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు కొరడా ఝులిపించారు. ఈ మేరకు శనివా రం తిరుమలలోని దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టీటీడీ నుంచి సరైన అనుమతులు లేకుండా, అర్హులైన ఫార్మసిస్టు లేకుండా మందులను విక్రయిస్తున్న ఆరు దుకాణాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన దుకాణాలు ప్రభుత్వ డ్రగ్ లైసెన్సు, అర్హులైన ఫార్మసిస్టుల ద్వారానే మందులను విక్రయించాలని లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.