
పోగొట్టుకున్న నగదును బాధితులకు అందిస్తున్న రేణిగుంట సర్పంచ్
రేణిగుంట: రేణిగుంట గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు శ్రీనివాసులు తనకు దొరికిన నగదును బాధితులకు అందించి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద తిరుపతికి చెందిన రాజశేఖర్, వర్ష భోజనం ప్యాకెట్ అని భావించి తమ వద్దనున్న రూ.1.39 లక్షల నగదును పంచాయతీ కార్మికుడు శ్రీనివాసులుకు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే భోజనం చేసేందుకు కూర్చుని శ్రీనివాసులు కవర్ తెరిచి చూడగా, అందులో నగదు కట్టలు కనిపించాయి. విషయాన్ని పంచాయతీ పారిశుద్ధ్య కార్మిక నాయకుడు సుబ్బరాజుకు తీసుకెళ్లారు. ఆయన సర్పంచ్ నగేషం దృష్టికి తీసుకెళ్లి నగదు పోగొట్టుకున్న వ్యక్తుల వివరాలను కనుక్కొని వారిని పంచాయతీ కార్యాలయానికి పిలిపించి గంట వ్యవధిలోనే అందజేశారు. వారు కార్మికుని నిజాయితీని గుర్తిస్తూ అందులోని రూ.15 వేలను ప్రోత్సాహకంగా అందించారు.