WHO: Prescribes a new additional dose before the booster dose covid vaccine - Sakshi
Sakshi News home page

WHO: ఒకటి రెండూ కాదు..మొత్తంగా నాలుగు..! ​​కోవిడ్‌ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు

Jan 23 2022 3:10 AM | Updated on Jan 23 2022 8:40 AM

WHO prescribes a new additional dose before the booster dose covid vaccine - Sakshi

Covid-19: మొదటి, రెండో డోసు తర్వాత.. బూస్టర్‌ డోసుకు ముందు కొత్తగా అదనపు డోసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి ఈ డోసు వేస్తేనే కరోనా నుంచి సమగ్ర రక్షణ లభిస్తుందని స్పష్టం చేసింది. అంటే వీరు మొత్తం నాలుగు డోసులుగా టీకాలు తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్లకు సంబంధించి ప్రాధాన్యాలపై డబ్ల్యూహెచ్‌ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నవారిలో వ్యాక్సిన్‌ సంబంధిత రక్షణ ఉత్పత్తి కావడం లేదు. ప్రస్తుత కేన్సర్‌ రోగులు, అలాగే ఏడాదిలోపు కేన్సర్‌ మందులు వాడినవారు, రెండేళ్ల లోపు అవయవ మార్పిడి జరిగిన వారు, డయాలసిస్‌లో ఉన్నవారు, ఎయిడ్స్‌ రోగుల్లో సీడీ4 సెల్స్‌ 200 కంటే తక్కువున్న వారు.. ఇలా ఏదో ఒకరకంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అదనపు డోసు ఇవ్వాలి. మిగతావారికి ఈ అదనపు డోసు అవసరం లేదు.  

అందరికీ బూస్టర్‌ డోసు
ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏవీ కూడా కరోనా వ్యాప్తిని ఆపలేవు. ఒమిక్రాన్‌ విషయంలో వ్యాక్సిన్ల పనితీరు గతంతో పోలిస్తే తగ్గింది. అందువల్ల అందరికీ బూస్టర్‌ డోసు తప్పనిసరిగా వేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. అయితే హైబ్రిడ్‌ ఇమ్యూనిటీతోనే కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. సాధారణ రోగనిరోధక శక్తి, బూస్టర్‌ డోసు కంటే కూడా ఇది చాలా శక్తిమంతమైంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో పాటు, ఒకసారి ఇన్ఫెక్షన్‌కు గురైతే హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఒక డోసు టీకాతో పాటు రెండుసార్లు ఇన్ఫెక్షన్‌ సోకినా ఈ తరహా రోగనిరోధకత అభివృద్ధి చెందుతుంది. ఇది ఎలాంటి కరోనా వైరస్‌నైనా ఎదుర్కొంటుంది. 

60 ఏళ్లు పైబడితే హైరిస్క్‌లో ఉన్నట్టే
బూస్టర్‌ డోసు కరోనా మరణాలను, రోగ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరోనా సోకినా తక్కువ లక్షణాలుంటాయి. లక్షణాలున్నప్పటికీ జబ్బు తీవ్రం కాకుండా చూస్తుంది. హైరిస్క్‌ గ్రూప్‌ వ్యక్తులకు బూస్టర్‌ డోసును మొదటి ప్రాధాన్యంగా వేయాలి. 60 ఏళ్లు పైబడినవారు హైరిస్క్‌లో ఉన్నట్లు లెక్క. 18–60 మధ్య వయస్సులో ఉన్న దీర్ఘకాలిక జబ్బులు లేనివారికి (లోరిస్క్‌ గ్రూప్‌) మొదటి డోసు వేయడం కంటే, హైరిస్క్‌ గ్రూప్‌కు బూస్టర్‌ డోసు వేయడం చాలా ముఖ్యం. 

తక్కువ రోగనిరోధకశక్తి కలిగినవారు...

  • పుట్టుకతోనే తెల్ల రక్తకణాలు తక్కువ ఉండేవారు.
  • పుట్టుకతోనే ఇమ్యునోగ్లోబిలిన్‌ (ఎం) అధిక సంఖ్యలో ఉండటం, కొన్ని రకాల కణాలు తక్కువగా ఉండటం (ఐఎల్‌–12, ఐఎల్‌–23, ఐఎఫ్‌– గామా)
  • తెల్ల రక్తకణాల కదలికల్లో లోపం ఉండటం
  • పుట్టుకతోనే బీ సెల్స్, టీసెల్స్‌ సరిగ్గా స్పందించక పోవడం. 
  • సీడీ 4 సెల్స్‌ తక్కువగా ఉండటం వల్ల అరుదైన జన్యు సమస్యలు ఉన్నవారు.
  • కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఉన్నవారు. 
  • శరీరమంతా పూర్తిగా తెలుపు రంగులోకి మారినవారు. 

రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి అడిషనల్‌ డోసును రెండో డోసు తర్వాత ఒకటి నుంచి మూడు నెలల్లోపు ఇవ్వాలి. ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో బూస్టర్‌ డోసు (నాలుగో డోసు) ఇవ్వాలి.    – డబ్ల్యూహెచ్‌ఓ


బూస్టర్‌ డోసులో ప్రాధాన్య గ్రూపులు

  • ఆరోగ్య సిబ్బంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడినవారు. 
  • 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, టీచర్లు, అత్యవసర  సిబ్బంది, మురికివాడల్లో ఉండేవారు, శరణార్థులు, వలస కార్మికులు
  • 18– 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు. 18 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.
  • ఏ జబ్బూలేని 18 ఏళ్ల లోపు పిల్లలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement