ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం

We will bring Corona under the purview of Aarogyasri says KCR - Sakshi

ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం కేసీఆర్‌

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మిన్న

ఆరోగ్యశ్రీ, 108లను వైఎస్సార్‌ తెచ్చి మంచే చేశారు 

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆగడాలపై టాస్క్‌ఫోర్స్‌

కేంద్రానివి శుష్కప్రియాలు శూన్య హస్తాలు..

ఇప్పటివరకు కరోనా కోసం ఇచ్చింది రూ. 265 కోట్లే

వైరస్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరిక

కరోనాపై చర్చలో సీఎంకు అక్బరుద్దీన్‌ ఒవైసీకి వాగ్వాదం

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ తదితరులు చేసిన సూచనల్లో కొన్ని పాటించేవి ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని.. ఆ పథకాలు బాగున్నందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నా    మని స్పష్టంచేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఆయుష్మాన్‌ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని చెప్పామన్నారు. కేంద్రం అనుమతిస్తే రెండూ కలిపి వాడతామని వెల్లడించామన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే... 

కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు దుర్మార్గం.. 
కార్పొరేట్‌ ఆసుపత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కరోనాతో చనిపోయినా, ఆ శవాలు ఇవ్వడానికి కూడా డబ్బులు అడుగుతూ పీడించడం సమంజసం కాదు. ఏ ఆసుపత్రిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీ వేస్తాం. టాస్క్‌ఫోర్స్‌ ఈ రోజే వేస్తాం. తీసుకున్న చర్యలపై వారానికోసారి బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలకు నివేదిక పంపిస్తాం. ప్రైవేట్‌ ఆసుపత్రులు లూటీ చేస్తాయని మొదట్లోనే చెప్పాను. అందుకే వాటికి అనుమతినివ్వలేదు. ఐసీఎంఆర్‌ 15 ఆసుపత్రులకు అనుమతినిచ్చింది. ఎవరో హైకోర్టుకు వెళ్లారు. ఇక హైకోర్టు ఆర్డర్లను అమలు చేశాం.. ప్రైవేటు దోపిడీ మొదలైంది. కరోనా అడ్డుకునే విషయంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల జీతాలు 60 శాతం ఆపేసి చేశాం. రైతుబంధుకు నిధులిచ్చాం. అన్ని రకాల మందులు నూటికి నూరు శాతం ఉన్నాయి. నేను గాంధీ ఆసుపత్రికి వెళ్లలేదంటున్నారు. కానీ రేయింబవళ్లు దీనికోసం పని చేశాను. ఆర్థిక శాఖలో మూడు, నాలుగు కోట్లు కరోనా కోసం రిజర్వులో పెట్టాం. 20 వేల బెడ్లు ఒకేసారి అందుబాటులో ఉంచేలా చేశాం. లక్ష మందికి చికిత్స చేసేలా సిద్ధం చేశాం. ఉత్పాతం వస్తే ఏం చేస్తాం? బెంబేలెత్తిస్తామా? భరోసా కల్పిస్తామా? మేం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉన్నాం. ప్రజల్లో భరోసా నింపుదాం. వారిలో భయాందోళన లు కలిగించకూడదు. ఈటల రాజేందర్‌ను అందరూ మెచ్చుకున్నారు. ఆయన పనితీరు ప్రశంసనీయమైంది. ఆయనకు రిలీఫ్‌ ఇచ్చేందుకు రెండ్రోజులు నియోజకవర్గానికి వెళ్లమని సూచించాను. 

మేం ప్రతిపక్షాలతో కలువం.. 
అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా మేం ప్రతిపక్షాలతో కలిసేది లేదు. వారు హుందాగా లేకుం టే ఎలా కలుస్తాం.. ముందే వ్యతిరేక భావనతో ఉంటే ఎలా కలసి మాట్లాడుతాం. మేం లాక్‌డౌన్‌ సమయంలో 2 లక్షల వలస కార్మికులను ఆదుకున్నాం. వాళ్ల ఊళ్లకు పంపించాం. కొందరిని రప్పించాం. పెన్షన్లు కొనసాగించాం. ఇప్పుడు నూటికి నూరు శాతం ఆక్సిజన్‌ బెడ్లు పడకలుండాలని చెప్పాం. వైన్‌ షాపులను పంజాబ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తెరవలేదా భట్టి విక్రమార్క..? ఏప్రిల్‌లో రూ.15 వేల కోట్లకు వందల కోట్లే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కొన్ని అప్పులు తెచ్చాం. ఆరోగ్య శాఖ ఏం చేయాలో అది చేస్తుంది. మొదటిదశలో ప్రభుత్వంలోనే పెట్టాం. కొందరు తమ ఇళ్లు పెద్దగా ఉన్నాయంటే హోం ఐసోలేషన్‌కు పంపించాం. వ్యాధి కంటే భయంతోనే ఎక్కువగా చనిపోతుంటారు. మరణాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల కంటే తక్కువున్నాయి. చావుల్లోనూ రాజకీయాలేనా? చావులను దాయడం సాధ్యమేనా? మేం తిరగలేదా? మా ఎమ్మెల్యేలూ కరోనా బారినపడ్డారు. లక్షల ప్యాకెట్లు ఇచ్చాం. భోజనాలు పెట్టాం. మంత్రులూ తిరిగారు. మేం పట్టించుకోనట్టు మాట్లాడొద్దు. ప్రభుత్వాన్ని తక్కువ చేయాలని అనుకుంటున్నారు. 2014లో 1,824 మంది డాక్టర్లు ఉంటే, ఇప్పు డు 3,550కు పెంచాం. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఇంకా పది వేల కోట్లయినా ఖర్చు చేస్తాం. ప్రజలు ఎవరికి వారే రక్షించుకోవాలి. అదే శ్రీరామరక్ష.. పరిస్థితి మన చేయిదాటి పోలేదు. రికవరీ, మరణాల్లో మనం మంచిగానే ఉన్నాం. కేసీఆర్‌ బతికే ఉన్నాడు. కాబట్టి ఎన్ని టెస్టులైనా చేస్తాం.. 

ధాన్యమంతా కొన్నాం.. 
కరోనా వస్తే ఏ ప్రభుత్వం కూడా మొత్తం ధాన్యం కొనలేదు. కానీ మేం అంతా కొనుగోలు చేశాం. పచ్చ జొన్నలు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొన్నాం. సమాజంపై మాకు బాధ్యత లేదంటారా? ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టాం. రూ.17 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. డాక్టర్లు, పోలీసులకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. పేదలను హోం ఐసోలేషన్‌కు పంపొద్దని అంటే అలాగే విస్తృతంగా చేస్తాం. వ్యాధి ప్రమాదం ఇంక పొంచి ఉంది. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో పనిచేసే వారికి మేమే ప్రోత్సాహకాలిచ్చాం. ఫలితంగా సీజనల్‌ వ్యాధులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ కృషి బాగా ఉంది. త్వరలో కరోనా తగ్గుతుందని భావిస్తున్నాం. ఐసీఎంఆర్‌ను అనుసరించి ముందుకుపోతున్నాం. వాలంటరీ సంస్థలకు, సేవలు చేసిన వారందరికీ అభినందనలు. ప్రజాప్రతినిధులను అభినందిçస్తున్నాం. నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. అన్‌లాక్‌ తర్వాత రికవరీలో ముందున్నాం. డబ్బులకు గతిలేని పరిస్థితిలో లేం. పరిస్థితి ఇప్పుడు కాస్త బాగానే ఉంది. మజ్లిస్‌ కృషిని అభినందిస్తున్నాం. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయాలని అనుకోవడం మంచిదికాదు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కేంద్రం చెప్పినా అందులో నుంచి ఏమీ రాలేదు. మీరు కూడా నాకు ఒక ప్రతిపాదన పంపించండి. కరోనా సోకిన పేదలకు సాయంపై ఏ నిర్ణయం తీసుకోవాలో చేస్తాం. సచివాలయంలో మందిరం, చర్చి, మసీదులు ఏర్పాటు చేస్తాం. 

మాకూ సమయం ఇవ్వండి.. 
రామలింగారెడ్డి మరణిస్తే అందరినీ మాట్లాడించలేదు. దీంతో మా ఎమ్మెల్యేలు నన్ను నిలదీశారు. వారు కూడా మాట్లాడాలి కదా.. మా సభ్యులకు కూడా మాట్లాడటానికి అవకాశం కల్పించండి (స్పీకర్‌తో).. మాకూ న్యాయం చేయండి. శ్రీధర్‌బాబు కు పీవీతో ఎంతో అనుబంధముంది. ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం వస్తుంది. మా గొంతే పెద్దది. నేను ఒకప్పుడు ఇందులో సింగిల్‌ సభ్యుడినే. నాకు 15 నిముషాలే ఇచ్చారు. అప్పుడు వీరంగం వేశానా? నిబంధనల ప్రకారమే అసెంబ్లీ నడుస్తుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులకు కూడా టైం ఇవ్వండి. లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది. మంచి సూచనలు చేస్తే బాగుంటుంది. రెవెన్యూపై శుక్రవారం మంచి సలహాలు ఇవ్వండి. సభ్యుల సంఖ్యను బట్టి పార్టీకి సమయం కేటాయిస్తారు. పార్లమెంటులోనైతే కనీసం విలేకర్లను కూడా రానీయలేదు. ఇక్కడ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ ఉంచాలని, విలేకరులను రానీయాలని స్పీకర్‌ను కోరాం. కానీ పార్లమెంటులో అన్నీ ఎత్తేశారు.

వారివి శుష్కప్రియాలు శూన్య హస్తాలు  
కరోనాపై కేంద్రానిది శుష్కప్రియాలు శూన్యహస్తాలు మాత్రమే.. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి రూ.265 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో రూ.90 కోట్లు ఇచ్చారు. కేంద్రం 647 వెంటిలేటర్లు ఇచ్చింది. వాటినీ గ్రాంట్‌లో కట్‌ చేస్తారు. మనం 700 వెంటిలేటర్లు కొన్నాం. ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. రుణం రూపంలోనూ రాలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం కూడా రాలేదు. దానికి షరతులు పెట్టారు. ప్రతీ పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ బెడ్లు ఉండాలని కోరాం. వచ్చే బడ్జెట్‌లో ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయిస్తాం. ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టు తీర్పు తర్వాత దీనిపై కలసి చర్చించి నిర్ణయం తీసుకుందాం. 

సీఎం వర్సెస్‌ అక్బరుద్దీన్‌.. 
కరోనాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎంకు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కోవిడ్‌ వారియర్స్‌కు అభినందనలు, కానీ డాక్టర్లు, నర్సులు, ఇతర సేవలు చేసిన వారిని మంత్రి ఈటల తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అక్బరుద్దీన్‌ నిలదీశారు. ఒవైసీ ఆసుపత్రి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కరోనాతో చనిపోయారు. వారియర్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పలేదన్నారు. మంత్రి ప్రసంగం కరోనా హెల్త్‌ బులెటిన్‌లాగానే ఉందని అక్బరుద్దీన్‌ విమర్శించారు. కరోనా వైరస్‌ వ్యవస్థపైనా, విద్యపైనా, పరిశ్రమలపైనా, వ్యవసాయంపైనా.. ఇలా అన్ని రకాల జీవితాలపై ప్రభావం చూపింది. కానీ ఇవన్నీ మంత్రి ప్రసంగంలో లేవన్నారు. దీనిపై మధ్యలో సీఎం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ మహాభారతం చెప్పినట్లు అంతా చెప్పరు కదా అని బదులిచ్చారు. అలా ఎందుకు గట్టిగా మాట్లాడుతారంటూ అక్బరుద్దీన్‌పై సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘కరోనాపై వివరాలు కావాలంటే సభ్యులకు వ్యక్తిగతంగా ప్రభుత్వం వివరాలిస్తుంది.

వైరస్‌ ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంది. అది ప్రభుత్వ వైఫల్యమంటే ఎలా? ఆరోగ్య కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చాం. మున్సిపల్‌ వర్కర్లకూ ఇచ్చాం’అని సీఎం అన్నారు. ఆ తర్వాత అక్బరుద్దీన్‌ మళ్లీ మాట్లాడారు. తాను ప్రభుత్వం విఫలమైందని అనడం లేదన్నారు. డాక్టర్లు, నర్సులకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. మళ్లీ సీఎం జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లకు సెల్యూట్‌ చేస్తే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతకుముందే సెల్యూట్‌ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తర్వాత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం అది పెట్టిన సందర్భం మంచిది కాదు. కరోనా రెండో వేవ్‌ వస్తోంది.. యూరప్, అమెరికాల్లో మొదలవుతోంది. మనం దానికి ప్రిపేర్‌ కావాలి. దానికోసం ప్రత్యేక సమావేశం పెట్టాలి. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారు. కరోనా రోగులు అక్కడకు పోవడానికి భయపడుతున్నారు. ప్రజల్లో నమ్మకం కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులను చేర్చుకోవాలి. ప్రజలకు ఉపాధి లేదు. ఆదాయం లేదు. అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆక్సిజన్‌ బెడ్లు హైకోర్టుకు ఒక లెక్క.. అసెంబ్లీలో ఒక లెక్క చూపిస్తున్నారు..’అని విమర్శించారు.

గుణపాఠం నేర్పిన కరోనా..
కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకో ప్రకటన చేస్తోంది. కేంద్రం కూడా నిర్దిష్టంగా చెప్పదు. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది. బాధ్యత గల వ్యక్తులుగా ఈ వైరస్‌ను పారదోలాలి. కరోనా విషయంలో మనమే కేంద్రాన్ని అప్రమత్తం చేశాం. ప్రధానితో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను పెంచాలని విన్నవించాను. అంతర్జాతీయ విమానాలు ఆపాలని కోరిన సీఎంను నేనే.. కరోనాతో కలసి బతకాల్సిందే. కరోనా ఒక గుణపాఠం చెప్పింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన విషయాన్ని వేలెత్తి చూపింది. ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా లేదు. మందులు ఫలానా అని ఏమీ లేవు. రెమిడెసివిర్‌ మందుల కోసం డబ్బులిచ్చాం. అయితే భయంతో చాలామంది చనిపోతున్నారు. ఆక్సిజన్‌ లేని బెడ్లు కాంగ్రెస్‌ నుంచే వచ్చాయి. మేం క్రియేట్‌ చేయలేదు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి గణనీయంగా బడ్జెట్‌ పెంచాలన్నదే కరోనా చెప్పిన గుణపాఠం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top