
పాముకాటుతో మృతి చెందిన శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)
రఘునాథపల్లి: పాముకాటుతో ఒకరు మృతి చెందగా.. ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్తే బతికిస్తారనే సూచన ప్రకారం అక్కడకు బయలుదేరారు.. అయితే, పోలీసులు హెచ్చరించడంతో తిరుగుపయనమయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పతేషాపూనకు చెందిన శివరాత్రి శ్రీనివాస్ (42)కు ప్రొక్లెయినర్ ఉంది. ఆయన ఆదివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి నేలపై నిద్రించారు. అర్ధరాత్రి దాటాక కాలుకు ఏదో కుట్టినట్టు అనిపించడంతో శ్రీనివాస్ మేల్కొన్నాడు. కట్ల పాము కాటు వేసినట్టు గుర్తించి పామును చంపారు.
అనంతరం చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, ఆపై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీçసుకెళ్తుండగా శ్రీనివాస్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ (ఉత్తరప్రదేశ్) అక్కడికి వచ్చాడు. ఆయన మృతదేహం చేయి పట్టుకుని నాడి కొట్టుకుంటున్నదని చెబుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. వెంటనే తీసుకొస్తే బతికిస్తానని అవతలి వ్యక్తి చెప్పడంతో కుటుంబసభ్యులు వాహనంలో బయలుదేరారు. ఇంతలోనే విషయం పోలీసులకు తెలిసి శ్రీనివాస్ మృతదేహం వెంట ఉన్న వారికి ఫోన్‌చేసి మరణించిన వ్యక్తిని ఎక్కడకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వారు వెనక్కి బయలుదేరారు.
చదవండి: Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు..