
ఉన్నది 34 మందే.. హౌసింగ్ బోర్డు ఉద్యోగుల వింత అవస్థ
శనివారం ఓ లీజు స్థలం స్వాదీనానికి మూడొంతుల మంది సిబ్బంది హాజరు
లీజు సిబ్బందితో వాదోపవాదం.. సహాయ ఎస్టేట్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి
తీవ్ర భయాందోళనల్లో అధికారులు.. సెలవుల్లో వెళ్లే యోచనలో కొందరు అధికారులు
లీజు స్థలాలకు ప్రత్యేక విభాగం, సిబ్బంది ఉంటేనే పనిచేస్తామని అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్‌బోర్డు సొంత సిబ్బంది సంఖ్య 34 మంది.. ఆఫీసుల్లో వారే పనులు చేయాలి.. భూముల కబ్జాలను నిరోధించే డ్యూటీలూ వారివే.. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిష్టవేసే వారిని ఖాళీ చేయించే విధులూ వారివే.. లీజు బకాయిల వసూలు ‘బాధ్యతా’వారిదే.. ఈ పనులు చేయకుంటే క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సిందే.. ఇలా ఎన్నో పాత్రల్లో పనిచేయాల్సి రావటం ఇప్పుడు వారి ‘ప్రాణం’మీదకు తెస్తోంది.
ముందురోజు రాత్రి పదింటి వరకు ఆఫీసులో డ్యూటీ చేసి, ఉదయం ఆరింటికే ఓ లీజు స్థలాన్ని స్వా«దీనం చేసుకోవటానికి వెళ్లిన బోర్డు సహాయ ఎస్టేట్ ఆఫీసర్.. అక్కడి వారితో జరిగిన వాదోపవాదాల మధ్య కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన హౌసింగ్‌బోర్డు సిబ్బంది పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకప్పుడు 800 మంది ఉద్యోగులతో కళకళలాడిన హౌసింగ్‌బోర్డు ఇప్పుడు 34 మంది సొంత సిబ్బంది, వారికి సహాయంగా ఉన్న కొందరు ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.
లీజుదారుల ఆగడాలతోనే అసలు ఇబ్బంది
ఇళ్లను నిర్మించి ఇచ్చే ప్రధాన భూమిక నుంచి హౌసింగ్‌బోర్డు ఎప్పుడో వైదొలిగి.. ఉన్న భూము లను వేలం రూపంలో అమ్ముకునేందుకు పరిమితమైన నేపథ్యంలో.. సిబ్బంది కొరత పెద్ద అడ్డుగా మారలేదు. కానీ, దాదాపు 100 ఎకరాల భూముల్లో ఉన్న లీజుదారుల ఆగడాలను ఎదుర్కొనే విషయంలో మాత్రం వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లీజుదారులు దాదాపు రూ.100 కోట్ల వరకు బోర్డుకు బకాయి ఉన్నారు.
ఈ మొత్తం వసూలుతోపాటు, లీజు గడువు ముగిసిన వారి చెర నుంచి భూములను స్వాధీనం చేసుకునే విషయంలో మాత్రం సిబ్బంది దినదినగండంగా పనులు చేస్తు న్నారు. శనివారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో లీజు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన బృందంలోని సహాయ ఎస్టేట్ ఆఫీసర్ జగదీశ్వరరావు వాదోపవాదాలతో తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందటం బోర్డు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
లీజు స్థలాలను ఖాళీ చేయించటం, లీజుల వసూలు తదితరాలకు ప్ర త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటంతోపాటు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిందేనన్న డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచుతున్నారు. ‘నాకు పెద్ద పోస్టుకు పదోన్నతి లభించిందన్న సంతోషం లేకుండాపోయింది. తీవ్ర ఒత్తిడి, భయాందోళనల మధ్య పని చేయాల్సి రావటం కష్టంగా మారింది. దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలన్న యోచనలో ఉన్నాను’బోర్డు ఇంజనీరింగ్ విభాగ ఉన్నతాధికారి ఒకరు సన్నిహితులతో అంటున్న మాట. మిగతావారు కూడా ఇలాంటి యోచనలోనే ఉన్నారు.
ఏళ్లకేళ్లుగా నియామకాలు లేకనే....
గత ప్రభుత్వం హౌసింగ్‌బోర్డును దాదాపు మూసేసినంత పనిచేసింది. ఏళ్లుగా నియామకాలు లేవు. దీంతో కేవలం 34 మంది సిబ్బందే మిగిలారు. శనివారం మెహిదీపట్నంలో ఓ ఫంక్షన్ హాలును ఖాళీ చేయించే పని కోసం ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని పిలిపించి దాదాపు 25 మంది వెళ్లాల్సి వచ్చింది. లీజుదారుల వైపు నుంచి బౌన్సర్లు రంగంలో ఉండటంతో వారిని ఎదిరించి స్థలాల్లోని భవనాలను సీజ్ చేయటం, ఖాళీ చేయించటం తమ వల్ల కావటం లేదని కొంతకాలంగా ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు.
కానీ, వారికి రక్షణగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ అధికారి చనిపోవటంతో తదుపరి ఇలాంటి కార్యాచరణకు తాము రంగంలో దిగమని ప్రభుత్వానికి తేల్చి చెప్పాలని మిగతా ఉద్యోగులు ఓ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. తమ రక్షణ కోసం చర్యలపై కోరినా, ఇలాంటి సాహసోపేత పనుల విషయంలో కాస్త తటపటాయించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అభియోగాలు నమోదు చేస్తే వాటిని సకాలంలో తొలగించే చర్యలు ఉండటం లేదని, వీటివల్ల పదోన్నతులు కోల్పోతున్నామని, రిటైర్ అయినా కూడా అభియోగాలు అలాగే ఉంచి పెన్షన్ రాకుండా చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.