క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది! 

Thousands of Lord Ganesha Idols Immersed Form More Wastages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరంలో గణేష్‌ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్‌ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
 
హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. 
జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్‌ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీఓడీ), కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. 

రసాయనాలు, మూలకాలిలా..  
రసాయన రంగుల అవశేషాలు: లెడ్‌ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్‌ ఆక్సైడ్, రెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్, రెడ్‌ లెడ్, క్రోమ్‌ గ్రీన్, పైన్‌ ఆయిల్, లిన్సీడ్‌ ఆయిల్, లెడ్‌ అసిటేట్, వైట్‌ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. 
హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్‌ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్‌ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్‌ ఆర్సినిక్, జిక్‌ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా.

తలెత్తే అనర్థాలు.. 

  • ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. 
  • పర్యావరణం దెబ్బతింటుంది. సమీప 
  • ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. 
  • ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.  
  • సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, 
  • మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్‌లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి.   

(చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్‌ అధికారి కీలక వ్యాఖ్యలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top