రేపట్నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు | Telangana set for temperature rise up to 44 degree Celsius from may 12: IMD | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

May 11 2026 1:24 AM | Updated on May 11 2026 1:24 AM

Telangana set for temperature rise up to 44 degree Celsius from may 12: IMD

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో వారం రోజులుగా సాధారణం, అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు కాగా.. మంగళవారం నుంచి క్రమంగా పెరిగి సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వివరించింది. ఈ వారాంతం వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 41.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 22.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement