చెరిగిపోని నెత్తుటి ధార | Telangana Sayudha Poratam: Many Villages Gives Lives In Parkal | Sakshi
Sakshi News home page

చెరిగిపోని నెత్తుటి ధార

Sep 2 2020 12:41 PM | Updated on Sep 2 2020 12:41 PM

Telangana Sayudha Poratam: Many Villages Gives Lives In Parkal - Sakshi

పరకాలలోని అమరధామం

స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం. ఇందులో పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల నాడు రక్తసిక్తమైంది. 1947 సెప్టెంబర్‌ 2న జాతీయజెండా ఎగురవేసేందుకు బయలుదేరిన ఉద్యమకారులపై రజాకార్ల తూటాల వర్షం కురిపించగా 15 మంది అమరులయ్యారు. ఇదే ఘటనలో 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన పరకాల మరో జలియన్‌వాలా బాగ్‌గా గుర్తింపుపొందింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమంపై కథనం.

జాతీయ పతాకంతో ఊరేగింపు
అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు గ్రామాల్లో నిజాం నిరంకుశ పాలనను రజాకారులను ఎదిరిస్తూ ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. రగులుకున్న ఈ మహోద్యమం చారిత్రక పోరాటానికి దారి తీసింది. ఉద్యమ నేతల పిలుపుమేరకు త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి 1947 సెప్టెంబర్‌ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన ఊరేగింపులో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినదించారు. 

చెట్టుకు కట్టి మరీ..
పతాక వందనానికి హాజరయ్యారనే కోపంతో గ్రామాలపై రజాకార్ల సైన్యం దాడి చేసింది. ప్రజలను అనేక విధాలుగా వేధింపులకు గురిచేశారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపడం సంచలనం కలిగింది.

చంద్రగిరి గుట్టల కేంద్రంగా సాయుధపోరాటం
పిస్తోళ్లు, మందు గుండు సామగ్రి సేకరించిన స్థానికులు ఉద్యమకారులు పోరాటం చేపట్టారు. చంద్రగిరి గుట్ట లను కేంద్రంగా చేసుకుని సాయుధ పోరాటం జరిపారు. చంద్రగిరి గుట్టలపై ఉద్యమకారులు నిర్వహించిన సా యధ శిక్షణ శిబిరాలపై దాడులు చేసి చేయడానికి ప్రయత్నించి అనేక సార్లు రజాకారులు విఫలమయ్యారు. అయితే, సాయుధ దాడులను తట్టుకోలేక నిజాం పోలీ సులు గ్రామాల్లో ప్రజలను విచక్షణారహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్‌ 17న సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. 

అమరవీరుల స్మారకార్థం అమరధామం
పరకాల ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించేలా అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్‌ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్‌ ఎదురుగా రెండేళ్లు శ్రమించి నిర్మాణం చేపట్టారు. అమరధామం పేరిట చేపట్టిన ఈ నిర్మాణాన్ని 2003 సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం ఎలాంటి ఉద్యమ కార్యక్ర మం జరిగినా ప్రజా సంఘాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఏటా సెప్టెంబర్‌ 2న అమరవీరులకు నివాళుల
ర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

దూసుకొచ్చిన తూటాలు
ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేర తుపాకులు ఎక్కుపెట్టా రు. ఉద్రేకం, ఉత్సాహంగా ఊరేగింపు జరుపుతున్న ఉద్యమకారులు తహసీల్దార్‌ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జియా ఉల్లా తమ బలగాలను మోహరించారు. నిజాం పోలీసుల తుపాకులు గర్జించడంతో చాపల బండ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది. రజాకారుల కసాయి చర్యల్లో శ్రీశైలం సహా పదిహేను మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఊరుకోకుండా నిజాం పోలీసులు, రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు.  

1
1/1

నాటి ఘటనను కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన విగ్రహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement