16,800 మందికి దళితబంధు

Telangana Implementation Of Dalit Bandhu Scheme - Sakshi

శనివారం ఉదయానికి ఖాతాల్లో రూ.1,680 కోట్లు

దళితులను చైతన్య పరిచేందుకు ప్రభుత్వం వ్యూహాలు 

విశ్రాంత ఉద్యోగులు, యువతతో ప్రత్యేక బృందాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది.

ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్‌ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

వాట్సాప్‌ గ్రూపు 
దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్‌పర్సన్‌ (ఆర్‌పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు.

దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్‌కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్‌ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు.

వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్‌లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్‌ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top