తెలంగాణ డిస్కంల పనితీరు అధ్వానం!

Telangana Discoms Gets B And D Grade In National Level - Sakshi

జాతీయస్థాయిలో రేటింగ్స్‌ అధోగతి

దక్షిణ డిస్కంకు బీ -గ్రేడ్, ఉత్తర డిస్కంకు సీ-గ్రేడ్‌

విద్యుత్‌ సాంకేతిక, వాణిజ్యనష్టాల్లో భారీ పెరుగుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు వెల్లడైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 41 డిస్కంల పనితీరును కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ పరిశీలించి రేటింగ్స్‌ నిర్ధారించింది. తాజాగా ప్రకటించిన 9వ వార్షిక సమగ్ర రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)కు ‘బీ -గ్రేడ్‌’, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)కు ‘సీ -గ్రేడ్‌’దక్కాయి. ఉత్తర తెలంగాణ డిస్కం బీహార్‌ లాంటి రాష్ట్రాల డిస్కంల సరసన నిలవడం గమనార్హం. అత్యుత్తమ పనితీరుతో గుజరాత్‌లోని నాలుగు డిస్కంలతోపాటు హర్యానాలోని ఒక డిస్కం ‘ఏ+’ గ్రేడ్‌ను సాధించి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవగా హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో డిస్కం ‘ఏ’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో లోపాలు  

  • నిర్దేశితం కన్నా అధిక వ్యయంతో విద్యుత్‌ కొనుగోళ్లు చేయడం
  • గడువులోగా 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల టారిఫ్‌ ప్రతిపాదనల (ఏఆర్‌ఆర్‌)ను ఈఆర్సీకి సమర్పించకపోవడం
  • సంస్థకు వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం
  • విద్యుత్‌ బిల్లుల వసూళ్లతోపాటు కొనుగోళ్లకు జరిపే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
  • పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం
  • సాంకేతిక, వాణిజ్య(ఏటీ అండ్‌ సీ) విద్యుత్‌ నష్టాలను తగ్గించుకోకపోవడం

టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లోని కీలక లోపాలు  

  • 2018-19లో 26.66 శాతం ఉన్న విద్యుత్‌ నష్టాలు 2019-20లో 34.49 శాతానికి పెరిగిపోవడం
  • 2019-20లో యూనిట్‌కు రూ.5.26 చొప్పున అధిక ధరతో విద్యుత్‌ కొనుగోళ్లు చేయడం
  • 2020-21, 2021-22ల టారిఫ్‌ ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా ఈఆర్సీకి సమర్పించకపోవడం
  • 2019-20లో అధిక ధరతో విద్యుత్‌ కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీలు రాకపోవడంతో సంస్థ చేసిన వ్యయం తిరిగి రాబట్టుకోలేకపోవడం  
  • పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం 
  • విద్యుత్‌ బిల్లుల వసూళ్లు, విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top