సాక్షి, హైదరాబాద్: రేపు(నవంబర్ 7, శుక్రవారం) జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12కు తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 12న జరిగే కేబినెట్‌లో గిగ్ వర్కర్స్ బిల్లును ప్రభుత్వం ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు చేయనుంది.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గత నెల (అక్టోబర్ 23 గురువారం)న గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇందు కోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్‌కు ఫైల్ పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.


