రైతును 20 ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధం
4 నెలల్లోగా ప్రత్యామ్నాయ భూమిని భౌతికంగా అప్పగించండి.. హైకోర్టు విస్పష్ట తీర్పు..
ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమే
అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఆక్షేపణీయం
పిటిషనర్ పడిన మానసిక వేదన, బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారు?.. రూ.10 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలన్న న్యాయమూర్తి
శ్రీరాంసాగర్ నిర్వాసితురాలికి రెండు దశాబ్దాల తర్వాత న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడం రాజ్యాంగ హక్కు అని హైకోర్టు నొక్కి చెప్పింది. పరిహారం చెల్లించే విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. బాధితురాలైన ఓ వృద్ధ మహిళను పదేళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వాదనలు స్వార్థపూరితంగా ఉన్నాయని, విశ్వసనీయత ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు చట్టబద్ధమైందని, ఆర్టీకల్ 300ఏ ప్రకారం రాజ్యాంగ హక్కని పేర్కొంది.
తప్పనిసరి పునరావాస ప్రయోజనం కోసం పిటిషనర్‌ను ఇరవై ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్లు పిటిషనర్ పడిన మానసిక వేదన, బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించింది. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి, భౌతికంగా అందజేయకుంటే అది రైతు జీవనోపాధిని దెబ్బతీసినట్లేనని తేల్చి చెప్పింది. మహిళా రైతుకు రెండెకరాల భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని, డాక్యుమెంటేషన్ పూర్తి చేసి భూమిని భౌతికంగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇరవై ఏళ్లుగా భూమి కోల్పోవడం ద్వారా నష్టపోయిన వ్యవసాయ ఆదాయానికి పరిహారంగా రూ.10 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు, పొలం కోల్పోయి..
ప్రస్తుతం నిజామాబాద్‌లో నివసిస్తున్న దంతకళ చిన్నక్క.. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలోని తన ఇల్లు, పొలాన్ని కోల్పోయారు. 2006లో ప్రభుత్వం సమీప గ్రామంలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించి పట్టా జారీ చేసినా భౌతికంగా స్వా«దీనం చేయలేదు. భూమి కోసం చిన్నక్క అధికారుల చుట్టూ పదేళ్ల పాటు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విధిలేక 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పునరావాస, పునఃస్థాపన పథకం కింద భూమి అప్పగింత ప్రయత్నాలు సాగుతున్నాయని, అంతర్గత కార్యాలయాల నుంచి సమాచార జాప్యం కారణంగా అప్పగింత ఆలస్యమవుతోందన్న జీపీ వాదనలను తిరస్కరించారు. అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరుపేద మహిళా రైతు ఏం చేయలేరన్న వైఖరిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 226 కింద తమ అసాధారణ అధికార పరిధిని వినియోగించుకోవడానికి ఇది సముచితమైన కేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
సర్కారు తీరు దిగ్భ్రాంతికి గురి చేసింది: న్యాయమూర్తి
రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సహించరానిదని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సర్కారు తీరు న్యాయస్థానాన్ని ది్రగ్బాంతికి గురి చేసిందని చెప్పారు. అధికారంతో పౌరులను వారి జీవనోపాధి నుంచి దూరం చేయలేరని చెప్పారు. ఉత్తర్వుల కాపీ అందిన నాటి నుంచి నాలుగు నెలల్లో ప్రత్యామ్నాయ సాగు భూమిని భౌతికంగా అందజేయాలని సూచించారు. హద్దులు నిర్ణయించి, పట్టాదారు పాస్‌బుక్, హక్కు పత్రాన్ని అందివ్వాలని ఆదేశించారు. ఏటా రెండెకరాలకు రూ.50 వేలు చొప్పున 20 ఏళ్లకు రూ.10 లక్షల నష్టపరిహారం 16 వారాల లోగా చెల్లించాలంటూ తీర్పునిచ్చారు.


