ఐదు రోజులాయే.. పులి బోనులో చిక్కేనా..?

Search Operation Continues To Trap Tiger At Asifabad Forest Area - Sakshi

పులిని బంధించేందుకు ఐదు రోజులుగా అధికారుల ప్రయత్నాలు

సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దపులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చడంతో అటవీశాఖ అలర్ట్‌ అయింది. ఆ పులిని బంధించేందుకు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ అధికారులు అడవిలో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటికి 5 రోజులైనా అటువైపు పులి అడుగు జాడలేవీ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ (22)పై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 12న దిగిడ అడవి, పెద్దవాగు సమీపంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో లేగ దూడలను ఎరగా వేసి పరిశీలిస్తున్నారు.

అయితే అటువైపు పులి సంచరిస్తున్నట్లు ఎటువంటి ఆనవాళ్లూ కనిపించడం లేదు. దీంతో సదరు నరహంతక పులిని బంధించడం అంత సులువుగా జరిగేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతునాయి. ఆ పులి బెజ్జూరు మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లిందనే అనుమానాలు ఉన్నప్పటికీ.. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా నది దాటే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి మొదట దాడి చేసింది స్థానిక పులి అయి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. అయితే ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించాక కొత్తగా వలస వచ్చినదై ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, స్థానికులను అడవుల్లోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తూ.. పులి సంచారంపై అప్రమత్తంగా ఉంటున్నారు.  
(చదవండి: పెద్దపులి టెర్రర్‌: యువకుడ్ని చంపి..)

అడవులను ఆనుకునే పత్తి చేలు.. 
గత దశాబ్ద కాలంగా అటవీ సమీప ప్రాంతాల్లో చెట్లను నరికి పంటలు సాగు చేయడం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలు కూడా సాగు భూములుగా మారాయి. పెద్దవాగు, ప్రాణహిత తీరాల వెంబడి వేలాది ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో కొంత మంది రైతులకు అటవీ హక్కు పత్రాలు ఉండగా వేలాది మంది రైతులకు ఎటువంటి గుర్తింపూ లేదు. పండించిన పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలా వెళ్తుంటారు. కొందరు విద్యుత్‌ తీగలతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ప్రమాదమే పొంచి ఉంది. అడవుల్లో సంచరించే రైతులకు పులులతో భయం ఉండగా.. విద్యుత్‌ కంచెలతో పులికి ముప్పు పొంచి ఉంది. అలాగే, అడవుల సమీపంలోనే నివాసాలు, పంట పొలాలు ఉండటంతో రైతులు నిత్యం అడవుల్లోకి వెళ్తుంటారు. ఈ క్రమంలో
స్థానికులకు రక్షణ కల్పిస్తూ పులి సంతతి పెంచడం అటవీ అధికారులకు సవాల్‌గా మారింది. 

మనుషులపై దాడి అరుదే.. 
పులి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మానవ సంచారం ఉన్న చోట పులి ఉండదని, మనుషులపై దాడి చేయడం చాలా అరుదని అంటున్నారు. కొత్తగా
వచ్చిన పులులు ఆవాసం వెతుక్కునే క్రమంలో చాలా దూరం సంచరిస్తుంటాయని, స్థిర ఆవాసం ఏర్పడితే అటువైపు వెళ్లకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామని అధికారులు వివరిస్తున్నారు.

దాడి చేసింది కొత్త పులి 
జిల్లా పరిధిలో సంచరించే పులులు కాకుండా కొత్తగా వచ్చిన పులి ‘దిగిడ’లో దాడి చేసిందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆనవాళ్లు స్థానిక పులులతో సరిపోలడం లేదు. కొత్తగా
ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన పులి అనేది తేలాల్సి ఉంది. పులిని బంధించేందుకు 12 బృందాలు పని చేస్తున్నాయి.  
– శాంతారాం, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top