దాడి చేసి.. కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లి

Tribal Farmer Killed In Suspected Tiger Attack In Asifabad District - Sakshi

కుమురంభీం జిల్లాలో రైతుపై పెద్దపులి పంజా

ఒంటరిగా చేనులో పత్తి ఏరుతుండగా దాడి

తీవ్రగాయాలతో మృతి చెందిన రైతు సిడాం భీము మృతి

అంతకుముందే ఓ కాపరిపై దాడికి పులి యత్నం

రెండ్రోజులపాటు ఎవరూ పొలం పనులకు వెళ్లొద్దన్న అటవీశాఖ

వాంకిడి (ఆసిఫాబాద్‌): చేనులో ఒంటరిగా పత్తి ఏరుతున్న రైతుపై పెద్దపులి పంజా విసిరింది. ఒక్కసారిగా దాడి చేసి సుమారు కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లి వదిలేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అటవీ ప్రాంతంలోని తన చేనులో పత్తి ఏరేందుకు పెద్ద కుమారుడు సిడాం అయ్యుతో కలిసి మంగళవారం వెళ్లాడు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు భోజనానికి వెళ్లగా.. భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి అతడిపై దాడి చేసింది. అరుపులు విని పక్క చేనులోనే పనిచేస్తున్న కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా.. రక్తం మరకలు, మనిషిని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు వెంటనే కొంత దూరంలో పోడు భూముల సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం అందించారు.

20 మంది వరకు సిబ్బంది చేనుకు చేరుకొని రక్తం మరకలు, పులి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను అనుసరిస్తూ వెతికారు. కిలోమీటరు దూరంలోని ఓ లోయలో భీము మృతదేహం లభ్యమైంది. అంతకుముందు భీము చేను సమీపంలో పశువులు మేపుతున్న ఆత్రం అన్నిగా అనే కాపరిపై పులి దాడికి యత్నించింది. అప్పుడు తన కూతురు గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి పరుగులు తీయడంతో పులి వెళ్లిపోయినట్లు అన్నిగా తెలిపాడు. జిల్లా అటవీశాఖ అధికారి దినేశ్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ఎవరూ పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు.

పశువులపై పులుల దాడి..
దహెగాం/తలమడుగు: కుమురంభీం జిల్లాలోని దహెగాం మండలం కర్జి అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి సోమవారం రాత్రి దాడి చేసింది. లంగారి వెంకటేష్‌కు చెందిన కోడె సోమవారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మంగళవారం అడవిలో వెతకగా కళేబరం లభించింది.

పులి దాడి చేసి హతమార్చినట్లు బీట్‌ అధికారి సుధాకర్‌ నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన బాబన్న లేగదూడపై మంగళవారం పులి దాడి చేసి గాయపర్చింది. తాంసి కే గ్రామ శివారు పొలంలో పులి వెనుక నుంచి దాడి చేయగా లేగదూడ తప్పించుకొని గ్రామానికి చేరింది. అటవీశాఖ అధికారులు పులి దాడిగా నిర్ధారించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top