సంబురంగా సంక్రాంతి | Sankranthi 2021 Festival Celebrations In Telangana | Sakshi
Sakshi News home page

సంబురంగా సంక్రాంతి

Jan 14 2021 1:30 AM | Updated on Jan 14 2021 5:17 AM

Sankranthi 2021 Festival Celebrations In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి బయట కాలు పెట్టాలంటే భయం. పదిమంది ఒకచోట కలిసిందీ లేదు. కష్టసుఖాలు కలబోసుకోలేదు. కరోనా నామ సంవత్సరం (2020) నిస్తేజంగా.. నిరుత్సాహంగా గడిచిపోయింది. పండుగలు.. పబ్బాలు లేవు. ఆంక్షల చట్రంలో ఎవరికి వారే గిరిగీసుకొని కూచోవాల్సిన పరిస్థితి. ఆటవిడుపు లేదు... ఓ ఆనందమూ లేదు. కోవిడ్‌ ఆందోళన నుంచి కాస్త ఉపశమనం కలుగుతున్న వేళ... పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలో పెద్ద పండుగ దసరా వేళ కరోనా భయం వెంటాడటంతో జనంలో కాస్త బెరుకు కనిపించి... పండుగ సాదాసీదాగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు కోవిడ్‌ భయం తగ్గడంతో.. దాదాపు పదినెలల తర్వాత ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పల్లెలకు సంక్రాంతి పండుగ కళ తెచ్చింది.

గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ, తర్వాత రెండు రోజులు వారాంతపు సెలవులు ఉండటంతో జనం సెలబ్రేషన్‌ మూడ్‌లోకి వెళ్లారు. చాన్నాళ్ల తర్వాత పండుగకు ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. బంధుగణమంతా ఒకచోటికి చేరారు. ముగ్గులతో లోగిళ్ల ముస్తాబు, పిండివంటలు, పిల్లల సందడి, పెద్దల కబుర్లతో... చాలాకాలం తర్వాత ‘పండుగ’వాతావరణం వెల్లివిరుస్తోంది. సరిగ్గా సంక్రాంతి వేళకే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుండటం వారిలో కొత్త ధీమాను నింపింది. దీంతో బుధవారం ఊరూవాడా భోగి వేడుకను సంబరంగా జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లాసంగా జరిగింది. రాజధాని నగరంలో కూడా కాలనీలు, బస్తీల్లో బుధవారం తెల్లవారుజామునే ఇళ్లముందు భోగి మంటలు కనిపించాయి. కోవిడ్‌ భూతాన్ని భోగి మంటల్లో దహనం చేస్తున్నామంటూ కొన్ని ప్రాంతాల్లో కర్రలపై కోవిడ్‌ అని రాసి మంటల్లో వేయటం కనిపించింది. 

ఆర్టీసీకి మాత్రం నిరాశే
పండుగ రోజుల్లో కిక్కిరిసే బస్సులతో బాగానే ఆదాయాన్ని పొందే ఆర్టీసీకి సంక్రాంతి అంటే మరింత కిక్కు. కానీ ఈసారి ప్రయాణికులు తగ్గడంతో సంక్రాంతికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. గతేడాది సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులను తిప్పగా, ఈసారి ఆ సంఖ్య 2998 మాత్రమే కావటం గమనార్హం. గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు 1,800 ప్రత్యేక బస్సులను తిప్పారు. ఈసారి కనీసం 1,600 తిప్పాలని భావించినా, కేవలం 1,200 మాత్రమే నడిచాయి. బస్టాండ్లలో రద్దీ అంతంతమాత్రమే కావటంతో దాదాపు 600 ప్రత్యేక బస్సులు డిపోల నుంచి బయటికి రావాల్సిన అవసరం రాలేదు. గతేడాది పండుగ ముందు వరుసగా మూడు రోజుల పాటు రూ.14 కోట్ల చొప్పున ఆదాయం నమోదైంది. మంగళవారం కేవలం రూ.11.50 కోట్లు మాత్రమే వసూలైంది. గతంతో పోలిస్తే ప్రత్యేక ఆదాయం రోజుకు రూ.రెండున్నర కోట్లు చొప్పున తక్కువగా నమోదవుతోంది. పండుగ రోజు నాటికి హైదరాబాద్‌ నుంచి దాదాపు 20 నుంచి 22 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేవారు. ఈసారి ఆ సంఖ్య 15 లక్షలలోపేనని భావిస్తున్నారు. కోవిడ్‌ ప్రభావంతో ఇప్పటికీ చాలామంది సొంతూళ్లలోనే ఉండిపోయారు. ఆ రూపంలో సంక్రాంతి రద్దీ కొంత తగ్గగా, బస్సుల కంటే సొంత వాహనాలే సురక్షితమన్న భావనతో వ్యక్తిగత వాహనాలపై కొందరు వెళ్లారు. ఇక వర్క్‌ఫ్రమ్‌ హోం, విద్యాసంస్థలు మూసి ఉండటంతో కొన్ని కుటుంబాలు ఊళ్లలోనే ఉండిపోయాయి. ఇది కూడా రద్దీ తగ్గడానికి ఓ కారణమైంది. 

రైళ్లదీ అదే పరిస్థితి
లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిస్థాయి సర్వీసులను ఇంకా రైల్వే పునరుద్ధరించలేదు. పండుగ వేళ నడిపే ప్రత్యేక రైళ్లను కూడా గతంతో పోలిస్తే సగమే నడుపుతోంది. ఈసారి 36 జతల ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుండగా, 44 జతలు ఇతర ప్రాంతాల నుంచి జోన్‌ మీదుగా తిరుగుతున్నాయి. ఏదైనా రూట్‌లో అదనంగా మరో సర్వీసు నిండేంత రద్దీ ఉంటే కొన్ని సర్వీసులు నడుపుదామని అధికారులు భావించినా, అంత రద్దీ లేకపోవటంతో వాటిని నడపలేదు. దీంతో ఉన్న రైళ్లే కిక్కిరిసి వెళ్లాయి. వెరసి గత సంక్రాంతి ప్రత్యేక రైళ్లతో పోలిస్తే ఈసారి సగమే నడిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement