సహస్రాబ్ది సమారోహం.. నమో నారాయణాయ!

Ramanuja Sahasrabdi Celebration Five Thousand Rutviks Muchintal - Sakshi

ఐదువేల మంది రుత్వికులు.. ఒకేసారి మంత్రోచ్ఛారణ

శోభాయమానంగా సాంస్కృతిక యాత్ర 

రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్‌/ శంషాబాద్‌ రూరల్‌:  ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణ. మధ్య ... తెలుగు రాష్ట్రాలకు చెందిన 2200 మంది కళాకారుల కళారూపాల ప్రదర్శనలతో ఆ ప్రాంతం పులకించి పోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగి పోయింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో తొలిరోజు బుధవారం అత్యంత శోభాయమానంగా మారింది.  

పుట్టమన్ను సేకరణతో.. 
అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని సేకరించారు. ఉత్సవ మూర్తితో పాటు పుట్టమన్నును భాజా భజంత్రీలతో ప్రధాన యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ మట్టిని అప్పటికే అక్కడ సిద్ధం చేసిన కుండలాల్లో నవ ధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ సమయంలోనే రుత్వికుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల నోట నారాయణ జపాలతో ఆ ప్రాంతం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనే రుత్వికులకు రక్షా సూత్రాలు(కంకణాలు), వస్త్రాలు అందజేయగా.. వారు దీక్షకు కంకణబద్ధులయ్యారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక యాత్ర  
వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు, భక్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు గాను పెద్దసంఖ్యలో కళాకారులు శ్రీరామనగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు కిన్నెర వాయిద్య కళాకారులు కూడా పన్నెండు మెట్ల కిన్నెరలను వాయించడానికి ఇక్కడకి చేరుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరువందల మంది మహిళలు కోలాటం ఆడుతూ తీసుకొచ్చిన బోనాల జాతర అందరినీ ఆకట్టుకుంది. చినజీయర్‌ స్వామి సైతం ప్రత్యేకంగా బోనాల సందడిని యాగశాల వద్ద వీక్షించారు. చిన్నారి కళాకారుల ప్రత్యేక నృత్యాలు, ఆటపాటలు, సుమారు రెండు వందల మందితో డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో పాటు ప్రత్యేక కోలాటాలతో ప్రధాన ఆలయం నుంచి యాగశాల వరకు సాంస్కృతిక యాత్ర చేప ట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడి విశేషాలతో కూడిన  చిత్రాల గ్యాలరీని యాగశాల సమీపంలో ఏర్పాటు చేసింది. ఇందులో తిరుమల వెంకటేశ్వరుడికి సంబంధించిన కళాకృతులు, చిత్రాలు కొలువుదీరాయి. దీనికి పక్కనే భక్తులకు వినోదాన్ని పంచే సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

నేడు అగ్ని మథనం.. 
ఉత్సవాల రెండోరోజులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మథనంలో భాగంగా ఐదువేల మంది రుత్వికులతో పాటు యాజమాన్యులు వారికి కేటాయించిన యాగశాలల్లో ఆసీనులు కానున్నారు. సెమీ దండం, రావి దండం కర్రలతో మథించగా వచ్చిన అగ్నిని 144 యాగశాలల్లోని 1,035 కుండాలలో నిక్షిప్తం చేసి హోమాలను ఆరంభిస్తారు. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, పెద్ద జీయర్‌స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రవచన మండపంలో వేద పండితుల ప్రవచనాలు కొనసాగించనున్నారు. 

విద్యుత్‌ అంతరాయంతో...
సహస్రాబ్ది సమారోహంలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక లైన్లనూ ఏర్పాటు చేశారు. అయినా మొదటి రోజు కోతలు తప్పలేదు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రుత్వికులు, సేవకులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఉద్యోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సేవకులు, రుత్వికులకు ఇక్కడ వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. 

సహస్రాబ్ది సమారోహంలో నేడు 
►  ఉదయం 8.30 గంటలకు దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికై వాసుదేవేష్టి, అష్టోత్తర శతనామ పూజ   
►  9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం 
► 12.30 గంటలకు పూర్ణాహుతి 
► సాయంత్రం 5గంటలకు సాయంత్రపు హోమం.. 5.30 గంటలకు చినజీయర్‌ స్వామి థాతి పంచకం సహితంగా శ్రీ విష్ణు సహస్ర నారాయణ పారాయణం 
► రాత్రి 9.30 గంటలకు ఇష్టిశాలలో పూర్ణాహుతి 
► ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవచన మండపంలో పెద్ద జీయర్‌ స్వామి ఆరాధన, చిన జీయర్‌స్వామి, రామచంద్ర జీయర్‌స్వామి ఉపదేశాలు ఉంటాయి. ప్రధాన వేదికపై కర్ణాటక సంగీత కచేరీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భజనలు, పాలపర్తి శ్యామలానంద్‌ ప్రసాద్, నేపాల్‌ కృష్ణమాచార్య, అహోబిల జీయర్‌స్వామి ప్రవచనాలు ఉంటాయి.  

పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ 
లోకానికి సమతాస్ఫూర్తిని చాటిన శ్రీ భగవద్రామానుజుల వారి చిత్రంతో పోస్టల్‌ శాఖ రూపొందించిన ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ పోస్టల్‌ కవర్, స్టాంపును చినజీయర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తపాలా శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వి.వి.సత్యనారాయణరెడ్డి, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top