తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదు

Ramakrishna Rao Question to Central Govt on Debt mobilization - Sakshi

కేంద్రానికి నిరసన తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

రుణాల సమీకరణకు అనుమతి

ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడటమే.. 

కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారు? 

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రశ్న

అప్పు తీసుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌:  అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడడమేనని ధ్వజమెత్తింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సోమ వారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. మూలధన వ్యయం కోసం 2022–23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథ కాలకు నిధుల కోసం ఒకే నోడల్‌ ఏజెన్సీ నమూనా వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఇది కొనసాగింది.

అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్‌ టీవీ సోమనాథన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాలు జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుని, ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఆ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించారు.   

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాదని కేంద్రమే చెప్పింది.. 
మూలధన వ్యయం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లు , 2021–22లో రూ.15 వేల కోట్లు , 2022–23లో లక్ష కోట్లను రుణాల రూపేణా రాష్ట్రాలకు ఇస్తూ.. వాటిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనికి రాదని గతంలో కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మూలధన వ్యయానికి సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ , తెలంగాణ స్టేట్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లకు చెందిన వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగల స్థితికి వస్తాయని వెల్లడించారు.

కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సీడీసీలు ఇచ్చే రుణాల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కానీ వాటిలో కొన్ని అప్పులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం వివక్షే అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షపూరిత చర్యలు సరికావని పేర్కొన్నారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

ఇది అత్యంత కక్షపూరిత చర్య 
15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్‌ బడ్జెట్‌’ (ప్రభుత్వం నేరుగా తీసుకోని అప్పులు) అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని రామకృష్ణా రావు పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగానే భావించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలుపరచదలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి కానీ గత సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పడం ఏ మాత్రం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు అవసరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిబం ధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top