
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు ఈ నెల 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అండర్ సెక్రటరీ భూపేందర్ పాల్ సింగ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఏఐఎస్ (సీఎస్–ఆర్‌ఎం) రూల్స్–1960లోని రూల్–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్ (డీసీఆర్బీ) రూల్స్‌లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
పొడిగింపు పొందిన రెండో సీఎస్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి సీఎస్‌గా పనిచేసిన రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని ఒకసారి 3 నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆ తర్వాత పదవీ కాలం పొడిగింపు పొందిన రెండో సీఎస్‌గా రామకృష్ణారావు నిలిచారు. గతంలో ఒక ప్రయత్నంలో మూడు నెలలు మాత్రమే సర్వీసు పొడిగించగా, రామకృష్ణారావు విషయంలో మాత్రం ఒకేసారి ఏడు నెలల సర్వీస్ పొడగింపునకు కేంద్రం అనుమతించడం గమనార్హం.