రేడియో వినాలా? మీ దగ్గర లైసెన్స్‌ ఉందా?

Radio Users Need Licence Till The 1985 - Sakshi

1985 వరకు సాగిన రేడియో ట్యాక్స్‌ నిబంధనలు

ఏడాదికోసారి రెన్యువల్‌.. లేనిపక్షంలో జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: బైక్‌ లైసెన్స్, కారు లైసెన్స్‌ గురించి అందరికీ తెలుసు.. కానీ, రేడియో లైసెన్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా! రేడియో వినాలన్నా పన్ను.. కొనాలన్నా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రేడియో కొన్నవారు తొలుత రూ.15 చెల్లించి లైసెన్సు తీసుకునేవారు. అది క్రమంగా రూ.50కి పెరిగింది. అప్పట్లో నగరంలోని ఆజంపురా పోస్టాఫీసులో రేడియో లైసెన్సు దొరికేది. లైసెన్సుకు ఏడాది గడువు ముగిశాక రెన్యువల్‌ చేసుకోవాల్సిందే. లైసెన్సు లేకుండా రేడియో వింటున్నామన్న సంగతి వైర్లెస్‌ ఇన్‌స్పెక్టర్‌కు తెలిసిందో ఇక అంతే! రేడియోను జప్తు చేసేవారు. రూ.50 జరిమానా చెల్లిస్తేనే రేడియోను తిరిగి ఇచ్చేవారు. ఈ నిబంధనలు నిజాం కాలం నుంచి 1985 వరకు ఉండేవి. ఇక్కడ 1935లో దక్కన్‌ రేడియో ప్రారంభమైంది.

ఇంతకంటే ముందే 1918లోనే షేక్‌ మహబూబ్‌ నగరానికి రేడియోను పరిచయం చేశారు. ముంబైలో ఉండే తన మిత్రుడు ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో తయారైన రేడియోలను విక్రయించేవాడు. అతడి సలహా మేరకు నగరంలోని చెత్తాబజార్‌లో ‘మహబూబ్‌ రేడియో’పేరిట దుకాణం తెరిచారు. నగరంలో మొదటి రేడియో షాప్‌ అదే. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ఆయన కొడుకులు మహ్మద్‌ ముజీబుద్దీన్, మహ్మద్‌ మొయినుద్దీన్‌ నడుపుతున్నారు. తొలినాళ్లలో ఉన్నత వర్గాలు, ధనికుల వద్ద మాత్రమే రేడియో ఉండేది. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు మాత్రం మహబూబ్‌ రేడియో దుకాణం దగ్గరికి వార్తలు వినేందుకు వచ్చేవారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఆ ప్రాంతం జనంతో నిండిపోయేది. 

‘మార్కోనీ’తో మొదలై.. 
మార్కోనీ తయారు చేసిన రేడియో నుంచి చివరిసారిగా ఫిలిప్స్‌ తయారు చేసిన రేడియో దాకా ఆ షాపులో ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం తయారైన రేడియోలు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. తొలిసారి 1860లో మార్కోనీ తయారు చేసిన రేడియోకు ఒకే బ్యాండ్‌ ఉండేది. దాన్ని ‘లాంగ్‌ వే’అనేవారు. అనంతరం మీడియం వే, షార్ట్‌ వే.. ఇలా బ్యాండ్‌లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం సింగిల్, షార్టు వేపై 1–3 వరకు, మీడియం వేపై 1200 వరకు బ్యాండ్‌లు వస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top