ఇక విద్యుత్‌ లెక్కలు పక్కా! 

Power Distribution Company Required To Calculate Each Unit Of Electricity - Sakshi

డిస్కంలకు త్రైమాసిక, వార్షిక ఆడిట్‌లు తప్పనిసరి చేసిన కేంద్రం 

అమల్లోకి ఎనర్జీ ఆడిటింగ్‌ నిబంధనలు 

ప్రతి యూనిట్‌కు లెక్క ఉండాల్సిందే

వోల్టేజీ మార్చే ప్రతిచోటా మీటర్లతో లెక్కలు 

అసలు వినియోగం, నష్టాలపై కచ్చితమైన లెక్కలు తేలే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత విద్యుత్‌ వినియోగించారు, ఎక్కడెక్కడ ఎంతెం త నష్టం వాటిల్లిందన్న లెక్కలు ఇక పక్కాగా తేలనున్నాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ఎక్కడిక్కడ మీటర్లు పెట్టి, ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు లెక్కలు చూపాల్సి రానుంది. ఈ మేరకు డిస్కంలు త్రైమాసిక, వార్షిక విద్యుత్‌ ఆడిటింగ్‌ నిర్వహించడాన్ని తప్పనిసరి చేస్తూ ‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)’సంస్థ రూపొందించిన ఎనర్జీ ఆడిట్‌ నిబం ధనలు–2021ను కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చింది.

సర్టిఫైడ్‌ ఎనర్జీ మేనేజర్‌ ఆధ్వర్యంలో వచ్చే 60 రోజుల్లోగా డిస్కంలన్నీ త్రైమాసిక ఆడి ట్‌ పూర్తి చేయాలని.. ఇండిపెం డెంట్‌ అక్రిడేటెడ్‌ ఆడిటర్‌ ద్వారా వార్షిక విద్యుత్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించింది. అంతేకాదు డిస్కంలు ఈ ఆడిట్‌ నివేదికలను తమ వెబ్‌సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.  

వివిధ దశల్లో మీటర్లతో.. 
డిస్కంలు తమ సరఫరా వ్యవస్థల్లోని వివిధ వో ల్టేజీ స్థాయిల్లో ఆడిట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. విద్యుత్‌ కేంద్రాల నుంచి 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు వచ్చే విద్యుత్‌.. అక్కడి నుంచి 11 కేవీ ఫీడర్లకు జరిగే సరఫరా.. 11 కేవీ ఫీడర్ల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరా.. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి వినియోగదారులకు సరఫరా.. ఇలా అన్నిదశల్లో విద్యుత్‌ ఇన్‌పుట్, ఔట్‌పుట్‌లను రికార్డు చేయడానికి ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌ మీటర్లను అమర్చాల్సి ఉంటుం ది.

ప్రతి మూడు నెలలకోసారి, ఏడాదికోసారి ఆడిటర్లు మీటర్‌ రీడింగ్‌ లెక్కలు తీసి నివేదికలను రూపొందించనున్నారు. ఏ ఫీడర్‌/ ఏ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో విద్యుత్‌ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణాలేమిటన్నది తేలనుంది. సాంకేతిక కారణాలతో నష్టాలు వస్తే.. గుర్తించి మరమ్మతులు చేపడతారు. విద్యుత్‌ చౌర్యాన్ని అధికంగా ఉంటే నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా విద్యుత్‌ నష్టాలను తగ్గించే చర్యలు చేపడతారు. 

ప్రయోజనాలెన్నో.. 
వివిధ రంగాల విద్యుత్‌ వినియోగంతోపాటు సరఫరా (ట్రాన్స్‌మిషన్‌), పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌) సందర్భంగా ఏ ప్రాంతంలో ఎంత నష్టం వస్తోందన్న వివరాలు ఆడిట్‌ నివేదికల్లో ఉంటాయి. అధిక నష్టాలున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడానికి ఇది వీలుకల్పించనుంది. విద్యుత్‌ నష్టాలు, చౌర్యం నివారణకు ఆయా ప్రాంతాల అధికారులను బాధ్యులు చేయడానికి ఎనర్జీ ఆడిటింగ్‌ లెక్కలు ఉపయోగపడనున్నాయి. అంతేగాకుండా.. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలుగుతుంది. విద్యుత్‌ పంపిణీ రంగంలో నష్టాలను తగ్గించడం, డిస్కంలను బలోపేతం చేయడం లక్ష్యంగా.. ఇంధన పొదుపు చట్టం కింద కేంద్రం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. 

అసలు లెక్కలు బయటపడతాయి 
ప్రస్తుతం విద్యుత్‌ ఆడిటింగ్‌ లేకపోవడంతో డిస్కంలు.. నష్టాలు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశాలను నామ్‌కేవాస్తేగా అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో.. చాలావరకు విద్యుత్‌ నష్టాలను రైతుల ఖాతాల్లో వేసేస్తున్నారని, అసలు నష్టాలను తక్కువ చేసి చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్‌ అమల్లోకి వస్తే వాస్తవాలేమిటో తేలుతాయని కేంద్రం పేర్కొంటోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top