కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా! | Polytechnic Student Dies While Swimming In Warangal Incident | Sakshi
Sakshi News home page

కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!

Jun 21 2026 1:43 PM | Updated on Jun 21 2026 1:43 PM

Polytechnic Student Dies While Swimming In Warangal Incident

మూడు రోజుల్లో జన్మదినం.. అంతలోనే అనంతలోకాలకు

ఈతకెళ్లి పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన

ఘటనాస్థలిలో వద్ద రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు 

స్టేషన్‌ఘన్‌పూర్‌: మరో మూడు రోజుల్లో ఆ యువకుడి జన్మదినం ఉంది. అంతలోనే అనంతలోకాకు చేరాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లి బావిలో నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన చింత రమేశ్, అమల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వరుణ్‌తేజ్‌(16) ఉన్నారు.

ఇటీవల వరుణ్‌తేజ్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్ష రాసి రాంపూర్‌లోని వీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సీటు పొందాడు. కాగా, శనివారం కళాశాలలో దింపి వస్తానని తండ్రి చెప్పగా ‘డాడీ మూడు రోజుల్లో బర్త్‌డే ఉందిగా,  బర్త్‌డే తర్వాత కళాశాలకు వెళ్తా’ అని చెప్పి ఇంటి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు చింత ప్రభాస్, కరుణ్‌తేజ్, గోనెల అభిరాం, అరవింద్, ధీరజ్‌తో కలిసి మొత్తం ఆరుగురు స్థానిక వైకుంఠధామం సమీపాన ఉన్న గుడిసెబావిలోకి ఈతకెళ్లారు. సరిగా ఈతరాని వరుణ్‌తేజ్‌ మెళ్లగా బావి ధరి పట్టుకున్నాడు. అనంతరం ఈత కొట్టేందుకు యత్నిస్తున్న క్రమంలో స్నేహితులంతా చూస్తుండగానే అరుస్తూ నీటిలో మునిగిపోయాడు.

వెంటనే వారు భయంతో బావి నుంచి బయటకొచ్చి సమీపాన ఉన్న స్థానికులు, వరుణ్‌తేజ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై వినయ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీమ్‌తో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా గల్లంతైన విద్యార్థి మృతదేహం దొరకలేదు. బావి దాదాపు 100 ఫీట్లకు పైగా లోతు ఉండడం, నీరు చాలా ఉండడంతో మోటార్లతో నీటిని బయటకు తోడే చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటల సమయంలో బావిలో నీరు పూర్తిగా తోడేసి వరుణ్‌తేజ్‌ మృతదేహాన్ని వెలికితీశారు.

కాలేజీకెళ్లినా బతుకుదువు బిడ్డా..
కాగా, ఘటనా స్థలిలో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాలేజీకి వెళ్లినా బతికేటోడివి బిడ్డా అంటూ  రోదిస్తుండగా ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. వరుణ్‌తేజ్‌ మృతితో కుటుంబంతోపాటు పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement