అనాథ వృద్ధురాలి పాడె మోసి..మానవత్వం చాటిన పోలీసులు  | Sakshi
Sakshi News home page

అనాథ వృద్ధురాలి పాడె మోసి..మానవత్వం చాటిన పోలీసులు 

Published Sat, May 29 2021 9:57 AM

Police Helped To Orphan Old woman Funeral In Wanaparthy district - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: కరోనా కాలంలో తల్లిదండ్రులకు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న ఈ రోజుల్లో.. పోలీసులు మానవత్వం చాటారు. లాఠీ కాఠిన్యం వెనుక కారుణ్యం ఉందని, మనసున్న మనుషులమని చాటి చెప్పారు. ఆఖరి మజిలీకి నోచుకోని ఓ వృద్ధురాలికి అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శకుంతలమ్మ (80) అనారోగ్యానికి గురై శుక్రవారం కన్నుమూసింది.

దహన సంస్కారాలకు వరుసకు కూతురైన లక్ష్మీ, ఆమె భర్త బంధువులకు ఎంత వేడుకున్నా ఎవరి గుండె కరగలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాజి అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని ముందుకొచ్చారు. దహన సంస్కారాలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. ఎస్‌ఐ, ట్రెయినీ ఎస్‌ఐ రాజశేఖర్, ఐదుగురు కానిస్టేబుళ్లు పాడెను మోసి..అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది కురుమయ్యగౌడ్, రవి, శివకుమార్‌రెడ్డి, స్వాములు, కలాం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 

శ్మశానమే ఆవాసం 
సాక్షి, ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): కరోనా అనేక మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. సిద్దిపేటకు చెందిన కొత్వాల్‌ శ్రీనివాస్‌ (51) కరోనా కాటుకు బలయ్యాడు. నాయీ బ్రాహ్మణుడు అయిన శ్రీనివాస్‌.. కులవృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం కరోనా మహమ్మారి సోకింది. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఈ నెల 26న మరణించాడు. మృతుడి కుటుంబీకుల వద్ద చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని సమయంలో ఇంటి యజమాని వీరిని బయటికి పంపించేశాడు.

దీంతో నేరుగా సిద్దిపేటలోని శ్రీరామునికుంట శ్మశానవాటిక వద్ద అంత్యక్రియలు పూర్తయ్యాక ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో అక్కడే ఉండిపోయారు. గుర్తించిన మోక్షధామం హిందూ శ్మశానవాటిక అధ్యక్షుడు అయిత రత్నాకర్‌ శ్మశానవాటిక ఆవరణలోని షటర్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందించారు. ఉండటానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఆపన్నుల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, మృతుడికి భార్య సుజాత (35), కుమారుడు రుషీత్‌ (16), కూతురు దక్షిత (13) ఉన్నారు. తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. 

అనాథకు అండగా.. 
మదనాపురం:అనారోగ్యం కారణంగా ఓ మహిళ పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం స్పందించింది. ‘అందరూ ఉన్నా.. అనాథగానే!’శీర్షికన శుక్రవారం సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత ఆదేశం మేరకు.. వర్ధన్నపేటలో నిస్సహాయ స్థితిలో ఉన్న గబ్బెట విజయ ఆరోగ్య పరిస్థితిపై రెవెన్యూ, మునిసిపల్, వైద్య అధికారులు ఐసీడీఎస్, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు శుక్రవారం ఉదయం వెళ్లి ఆరా తీశారు. అదే సమయానికి ఆమె కుటుంబ సభ్యులు, సోదరి కూడా రావడంతో స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇక నుంచైనా విజయ బాధ్యతలు కుటుంబ సభ్యులు స్వీకరించకపోతే తాము పునరావాస కేంద్రానికి తీసుకెళ్తామని అధికారులు చెప్పగా.. కుటుంబ సభ్యులు తాము చూసుకుంటామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement