Mahabubnagar: కారాగారంలో కర్మాగారం

Petrol Bunk Runs By Prisoners In Mahabubnagar - Sakshi

స్వచ్ఛమైన డీజిల్‌ కావాలన్నా.. సేంద్రియ ఆకు కూరగాయాలు కొనుగోలు చేయాలన్నా.. ఇంటికోసం మన్నికైన ఫర్నిచర్‌ తీసుకోవాలన్నా.. చివరికి రుచికి రుచి.. అతి చవకైన ఇడ్లీలు సైతం జిల్లా జైలు వద్దనే దొరుకుతాయి. ఇవే కాదండోయ్‌ గోధుమపిండి, ఫినాయిల్, నోట్‌ పుస్తకాలు, తదితర వస్తువులు తయారవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నతరహా పరిశ్రమను తలపించేలా పాలమూరు జిల్లా జైలు మారింది. ఒకప్పుడు జైలు అంటే రాళ్లు కొట్టడం, వడ్రంగి పనులు చేయడం,అల్లికలు, చేతి కుట్లు లాంటివే గుర్తుకొచ్చేవి. కానీ, కాలక్రమేణా ఖైదీల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తూ.. వారి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ..వారి ఆర్థికాభివృద్ధికి జైలు అధికారులు వినూత్న సంస్కరణలను తీసుకొస్తున్నారు. అవి సత్ఫలితాలిస్తుండడంతో రాబోవు కాలంలో జైళ్లు నాణ్యతకు.. మన్నికకు పేరున్న వస్తువులు తయారయ్యే పరిశ్రమలుగా మారనున్నాయి. 

– మహబూబ్‌నగర్‌ క్రైం  

పెట్రోల్‌ బంకులో కాసుల వర్షం 
2016లో జిల్లా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు కారాగారానికి కాసుల వర్షం కురిపిస్తోంది. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి పెట్రోల్‌ బంక్‌. ప్రస్తుతం రోజుకు 7,500 లీటర్లు డీజిల్, 6వేల లీటర్ల పెట్రోల్‌ విక్రయిస్తుండగా.. వీటి ద్వారా నెలకు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. 2016 జూన్‌ నుంచి 2021 నవంబర్‌ వరకు రూ.38,291,566 ఆదాయం వచ్చింది.

ప్రస్తుతం 22మంది ఖైదీలు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు విడుదలైన ఖైదీలు ఉంటే మరో 16 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. విడుదలైన ఖైదీలకు నెలకు రూ.12వేల వేతనం ఇస్తుంటే.. శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు రోజుకు రూ.150 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఇక ప్రతి నెల నాగర్‌కర్నూల్‌ బంక్‌ ద్వారా రూ.7 లక్షలు, కల్వకుర్తి బంక్‌ ద్వారా రూ.4 లక్షలు, అచ్చంపేట బంక్‌ ద్వారా రూ.7లక్షల ఆదాయం వస్తుంది.

ఇక్కడ లభించే పెట్రోల్, డీజిల్‌ కల్తీ లేకపోవడంతో పాటు మైలేజీ ఇవ్వడంతో వినియోగదారులు అధి కంగా వస్తున్నారు. ఆదాయం బాగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో మరో పది బంక్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది.  

జైలులో 230 ఖైదీలు.. 
ప్రస్తుతం జిల్లాలో 230మంది ఖైదీలు ఉంటే వీరిలో జీవిత ఖైదీలు 29, రిమాండ్‌ ఖైదీలు పురుషులు 181, మహిళలు 20 మంది ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైలులో ఒక సూపరింటెండెంట్, ఇద్దరు జైలర్లు, ఒక డిప్యూటీ జైలర్, ఆరుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహిస్తున్నారు. 

ఆకుకూరల సాగు 
జిల్లా జైలు ఆవరణలో ఉన్న 15 గుంటల విస్తీర్ణంలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఇందులో పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూరతో పాటు వంకాయలు కూడా పండిస్తున్నారు. వీటి బాధ్యతను నలుగురు ఖైదీలు చూసుకుంటున్నారు. వీటి ద్వారా రోజుకు రూ.2వేల వరకు ఆదాయం వస్తోంది. కొనుగోలుదారులు నేరుగా జిల్లా జైలు ఆవరణలోకి వచ్చి ఆకుకూరలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  

ఫినాయిల్‌ తయారీతో మొదలై.. 
జిల్లా కారాగారంలో ఖైదీలు మొదట్లో కూరగాయల పెంపకం, కలుపుతీత పనులు చేయిస్తుండేవారు. దీంతో పెద్దగా ప్రయోజనం దక్కేది కాదు. ఈ క్రమంలో 2015 ఏప్రిల్‌లో ఖైదీలకు ఫినాయిల్‌ తయారీ పై శిక్షణ ఇచ్చి, వారితో తయారు చేయించడం మొదలుపెట్టారు. దీంతో ఆరేళ్లలో 15వేల బాటిల్స్‌ తయారు చేశారు. గతేడాది నుంచి స్టీల్‌ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు.

ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువైన బెంచీలు, బీరువాలు, మంచాలు, పాఠశాలలో ఉపయోగించే డెస్కును తయారు చేశారు. అలాగే 2019లో గోధుమలు కొనుగోలు చేసి జైలులో ఉన్న మిషన్‌ ద్వారా పిండి తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా రూ.1.77లక్షల అమ్మకాలు చేశారు. అలాగే 2018 నుంచి నోట్‌బుక్స్‌ తయారీ ప్రారంభం కాగా.. రూ.38 లక్షల ఆర్డర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రతి నెల రూ.2లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.

వీటి తయారీ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతాన్ని ఖైదీల వేతనాలకు చెల్లిస్తున్నారు. ఫర్నిచర్‌ నాణ్యతగా ఉండడంతో ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటితో పాటు బైండింగ్‌ వర్క్, టైలరింగ్‌ పనిలోనూ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలల పుస్తకాలను బైండింగ్‌ చేస్తున్నారు. డిష్, వాష్, హ్యాండ్‌వ్యాష్‌లు సైతం తయారు చేస్తున్నారు. 2021లో 200 బీరువాలు, 100 స్టూల్స్, 100 టేబుల్స్, 200 డెస్క్‌లు, 3వేల ఫినాయిల్‌ బాటిల్స్‌ తయారు చేశారు. వీటి ద్వారా రూ.25లక్షల అమ్మకాలు చేపట్టారు.

దాదాపు రూ.5లక్షల వరకు లాభపడ్డారు. ఇటీవల ఫర్నిచర్‌ తయారీ కోసం రూ.70 లక్షల ఆర్డర్‌ వచ్చాయి. ఇందుకోసం ఆరుగురు జీవిత ఖైదీలు, 15మంది రిమాండ్‌ ఖైదీలు పని చేస్తున్నారు. వీరికి రోజుకు రూ.100 వేతనం ఇస్తున్నారు. 

పరిశ్రమగా అభివృద్ధి చేస్తాం.. 
జిల్లా జైలులో ఉన్న పరిశ్రమను బాగా అభివృద్ధి చేస్తాం. ఆర్డర్‌ తీసుకుని రూ.లక్షల విలువ చేసే ఫర్నిచర్‌ తయారు చేసే దశకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఆకుకూరలు, పెట్రోల్‌ బంక్, ఇతర వస్తువుల ద్వారా మంచి ఆదాయం వస్తోంది. మరింత పెంచడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం.

దీంతో పాటు ఖైదీలలో మార్పు తీసుకురావడానికి చదువు నేర్పించి ఆలోచల్లో మార్పు తెస్తున్నాం. నేరం చేసి ఒకసారి వచ్చిన ఖైదీ బయటకు వెళ్లాక మరోసారి తప్పు చేయకుండా అవగాహన కల్పిస్తున్నాం.    

– వెంకటేశం, జిల్లా జైలు సూపరింటెండెంట్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top