HYD: హైటెక్నాలజీతో యూఎస్‌ కాన్సులేట్‌.. ఖర్చు తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌! 

New US Consulate Build In Hyderabad Cost Of Will Blow Your Minds - Sakshi

హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ కాన్సులేట్‌ సేవలు నానక్‌రాంగూడలోని నూతన కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభమయ్యాయి. బేగంపేట నుంచి నానక్‌రాంగూడలో కొత్తగా నిర్మించిన కార్యాలయానికి మారిన తర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని కాన్సులేట్‌ అధికారులు తెలిపారు. మొదటి యూఎస్‌ పాస్‌పోర్టును జారీచేసినట్టు ఫొటోలను కాన్సులేట్‌ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.

ఖర్చు ఎంతో తెలుసా..
అయితే, హైదరాబాద్‌ నగరంలో ఆసియాలోనే అతిపెద్ద, విశాలమైన అమెరికన్‌ కాన్సులేట్‌ కట్టి అగ్రరాజ్యం నిర్మించింది. దాదాపు 2800 కోట్లు(340 మిలియన్‌ యూఎస్‌ డాలర్స్‌) ఖర్చుతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. దాదాపు 12.2 ఎకరాల విస్తీర్ణంలో హై టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించింది. కాగా, తెలుగు రాష్ట్రాలు, దేశం నుంచి అమెరికాకు స్టూడెంట్‌ వీసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓ పెద్ద ఆఫీసును నిర్మించాలని అమెరికా 2017లోనే కాన్సులేట్‌ భవన నిర్మాణానికి ప్లాన్‌ చేసింది. ఇందుకు కావాల్సిన సదుపాయాలు, డబ్బులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. కానీ, కోవిడ్‌ కారణం భవన నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. 

హైదరాబాదే స్పెషల్‌..
ఇక, తాజాగా భవన నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కాన్సులేట్‌ నుంచి పాస్‌పోర్టులను కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇండియాలో ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ కాకుండా వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్‌ ఉన్నాయి. వీటన్నింటిలో అతిపెద్దదిగా ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ గుర్తింపు పొందింది. 

వీసా కోసం..
వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కూడా అక్కడే తీసుకుంటారు. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్‌ సెంటర్‌లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మరో రోజు నానాక్‌రాంగూడలోని కొత్త అమెరికన్ కాన్సులెట్ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

కాగా, కొత్త కాన్సులేట్‌ నుంచి తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లారెన్స్‌ తెలిపారు. మరోవైపు, వాషింగ్టన్‌లో అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ వేదాంత్‌ పటేల్‌ స్పందిస్తూ.. కొత్త భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మిణించినట్టు స్పష్టం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి శుద్ధిచేసేలా.. మళ్లీ ఆ నీటిని తిరిగి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, ఇండియా నుంచి అమెరికాలో పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి నూతన కాన్సులేట్‌ దోహదపడుతుందని అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top