ప్రతి లక్ష మందిలో 28.6 మంది బలవన్మరణం
ప్రాణాలను బలితీసుకుంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు
ఎన్‌సీఆర్‌బీ–2024 నివేదికలో వెల్లడి
ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఇవే
రాష్ట్రంలో కుటుంబ కలహాలు, ఇతర సమస్యల కారణంగా అత్యధికంగా 4,675 మంది (42.6%) ప్రాణాలు తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో 2,209 (20.1%) మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధలు తాళలేక 1,313 మంది, ఆస్తి తగాదాల వల్ల 727 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 170 మంది తనువు చాలించారు. ప్రేమ వ్యవహారాల వైఫల్యాలు కూడా బలవన్మరణాలకు దారితీశాయి. రాష్ట్రంలో 4 సామూహిక ఆత్మహత్యల కేసులు నమోదు కాగా, వీటిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆత్మహత్యల పరంపర తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో బలవన్మరణాల రేటు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు (ఏడీఎస్‌ఐ)–2024’నివేదిక గణాంకాలు ఈ చేదు నిజాన్ని కళ్లకు కట్టాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు సగటున 12.2గా ఉంటే, తెలంగాణలో అది ఏకంగా 28.6గా రికార్డవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 10,975 మంది ఆత్మహత్య ఎన్‌సీఆర్‌బీ–2024 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1,70,746 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో తెలంగాణ నుంచి 10,975 మంది ఉన్నారు. దేశ వ్యాప్త ఆత్మహత్యల్లో రాష్ట్ర వాటా 6.4 శాతంగా ఉంది. ఆత్మహత్యల రేటు (ప్రతి లక్ష జనాభాకు) ప్రకారం చూస్తే అండమాన్ నికోబార్ (40.6), సిక్కిం (36.3), కేరళ (30.2) రాష్ట్రాల తర్వాత 28.6 రేటుతో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది.
దినసరి కూలీలదే అగ్రస్థానం
రాష్ట్రంలో నమోదైన ఆత్మహత్యల్లో దినసరి కూలీలు, నిరుపేదలే అత్యధికంగా ప్రాణాలు తీసుకున్నారు. వృత్తుల వారీగా చూస్తే రాష్ట్రంలో ఏకంగా 5,745 మంది దినసరి కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 5,021 మంది పురుషులు, 723 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు 1,577 మంది, ప్రైవేటు రంగ ఉద్యోగులు 787 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 145 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గృహిణుల ఆత్మహత్యలు 789గా నమోదయ్యాయి. 763 మంది విద్యార్థులు, 118 మంది నిరుద్యోగులు, వివిధ కారణాలతో మరికొంత మంది కూడా తనువు చాలించారు.
అన్నదాతల ఆత్మహత్యలు తక్కువే
ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తెలంగాణకు సంబంధించి ప్రధాన సానుకూల అంశం వ్యవసాయ రంగంలో నమోదైంది. గత పదేళ్ల గణాంకాలతో పోలిస్తే అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు పూర్తిగా సున్నా (0)గా రికార్డయ్యాయి. సొంత భూమి, కౌలు భూమి సాగు చేసుకుంటున్న రైతులు కేవలం 43 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
ప్రమాద మరణాల్లోనూ పైపైకే..
రాష్ట్రంలో ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు సైతం ఆందోళనకరంగానే ఉన్నాయి. 2024లో తెలంగాణలో 13,458 ప్రమాద మరణాలు సంభవించాయి (దేశవ్యాప్త మరణాల్లో ఇది 2.9 శాతం). జాతీయ స్థాయిలో ప్రమాద మరణాల రేటు 33.3గా ఉంటే, తెలంగాణలో అది 35.1గా నమోదైంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల (వడదెబ్బ, పిడుగుపాటు తదితర) 222 మంది చనిపోగా.. ట్రాఫిక్/రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల 13,236 మంది ప్రాణాలు కోల్పోయారు.


