
పునరాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన దక్షిణ మధ్య రైల్వే
రూ.327 కోట్లతో రీ డెవలప్‌మెంట్ పనులు
హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడే విధంగా నిర్మాణ పనులు
అత్యాధునిక వసతులు.. హైటెక్ హంగులు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంనాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేవిధంగా నాంపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా రూ.327 కోట్ల అంచనాలతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. నాంపల్లి స్టేషన్ నుంచి ప్రతి రోజు 65 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 25 వేల మందికి పైగా ప్రయాణం చేస్తారు.
స్టేషన్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు, సమగ్రమైన రవాణా సదుపాయాలను అందజేసేందుకు గతంలోనే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఇందుకనుగుణంగా ప్రస్తుతం అభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ తరహాలోనే నాంపల్లికి చేరుకొనే రైళ్లు, బయలుదేరే రైళ్ల కోసం వేర్వేరుగా ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు సీమ్‌లెస్ జర్నీ సదుపాయాన్ని కలుగజేసేవిధంగా పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ చారిత్రక, వారసత్వ కట్టడాలను ప్రతిబింబించేవిధంగా, పర్యాటక ప్రాంతాలకు అద్దంపట్టేలా నాంపల్లి స్టేషన్‌ను ఒక అందమైన భవనంగా తీర్చిదిద్దనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పునరాభివృద్ధి ఇలా...
⇒ నవాబు కుటుంబాలకు రైల్వేసేవల కోసం అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్‌అలీఖాన్ 1907లో దక్కన్ రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. కాలక్రమంలో ఇది నాంపల్లి స్టేషన్‌గా స్థిరపడింది. సికింద్రాబాద్ తరువాత నాంపల్లి స్టేషన్ రెండవ స్థానంలో నిలిచింది. చార్మినార్, శబరి, నర్సాపూర్, గోదావరి తదితర ప్రధాన రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి.
⇒ సుమారు 9,245 చ.మీ.ల పరిధిలో స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను పునరాభివృద్ధి చేయనున్నారు. పర్యావరణహితమైన భవనాలుగా నిర్మిస్తారు. అలాగే విద్యుత్ సదుపాయం కోసం సోలాస్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తారు.
⇒ స్టేషన్ చుట్టూ ఉన్న 13,550 చ.మీ. పరిధిలో పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని, రెండో ద్వారాన్ని ఎత్తైన స్కై కాంకోర్స్‌తో కనెక్ట్ చేస్తారు.
⇒ నాంపల్లి మెట్రో స్టేషన్ (Nampally Metro Station) నుంచి ప్రయాణికులు నేరుగా రైల్వేస్టేషన్‌కు చేరుకొనేవిధంగా 9 మీటర్ల పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
⇒ సుమారు 1450 చ.మీ.వెయిటింగ్ హాళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏసీ డార్మెటరీతో పాటు 14 విశ్రాంతి గదులను నిర్మిస్తారు.
⇒ సుమారు 23,146 చ.మీ. విస్తీర్ణాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేటాయించనున్నారు. అలాగే స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్లను పునర్మించనున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.
⇒ నాంపల్లిస్టేషన్‌లో కొత్తగా 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, టికెట్ కౌంటర్‌లు, దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే అగ్నిమాపక యంత్రాలు, వైఫై సదుపాయం, ల్యాప్‌టాప్, మొబైల్‌చార్జింగ్ పాయింట్లు, ఫార్మసీ, వైద్య సదుపాయాలు, ఫుడ్‌కోర్ట్, షాపింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తారు.
⇒ సీసీటీవీలతో పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుంది.
⇒ వాన నీటి సంరక్షణకు భారీ ఎత్తున ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నారు.
⇒ మార్చి 2027 నాటికి నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
⇒ కాగా సికింద్రాబాద్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి.

నాంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో జీఎం పర్యటన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి), చర్లపల్లి రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాలు, వసతులను ఆయన సమీక్షించారు. బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, స్టేషన్‌లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నాంపల్లి స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ పనుల పురోగతిపై డివిజనల్ అధికారులు సమగ్ర నివేదికను ఆయనకు అందజేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లి పర్యటనకు ముందు ఆయన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో పర్యటించారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాళ్లు, స్లీపింగ్ పాడ్‌లు, కెఫెటేరియా, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, తదితర ఆధునిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుకింగ్ క్లర్క్, ‘సఫాయ్ మిత్ర’ సిబ్బందితో ఆయన సంభాషించారు. వారి డ్యూటీ వేళలు, పని వాతావరణం, వాళ్లకు అందజేసే సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.